పీపీఎఫ్.. డెట్ ఫండ్స్.. తగ్గుతున్న వడ్డీ రేట్లకు ఏది బెటరంటే!?

పీపీఎఫ్.. డెట్ ఫండ్స్.. తగ్గుతున్న వడ్డీ రేట్లకు ఏది బెటరంటే!?

ప్రస్తుతం వడ్డీ రేట్లు డౌన్‌ట్రెండ్‌లో ఉన్నాయని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. రుణాలు తీసుకున్న వారికి, తీసుకోబోయే వారికి ఇది ప్రయోజనమే అయినా, వడ్డీ చెల్లింపులపై ఆధారపడ్డ వారికి మాత్రం ఇది ఇరకాటమే. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించడంతో.. దాని ప్రయోజనం రుణం తీసుకున్న వారికి ఇంకా కలుగలేదు. అయితే, డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేట్లు 6-7 శాతం మధ్యకు తగ్గిపోయాయియ. అంటే గత 2-3 ఏళ్ల కాలంలో వడ్డీల రూపేణా వచ్చే ఆదాయం 20-30 శాతం క్షీణించింది. ద్రవ్యోల్బణం కారణంగా, కొన్ని వస్తువుల ధరలు అత్యధిక స్థాయిలకు చేరుకున్నాయి. ఇది ఫిక్సెడ్ డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడిన వారికి చుక్కలు చూపిస్తోందనే చెప్పాలి. 

ప్రజలు ఏం చేయాలి? ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీం
వయో వృద్ధులు అయితే సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌(ఎస్‌సీఎస్ఎస్)లో ఐదేళ్ల కాలపరిమితితో పెట్టుబడి చేయవచ్చు. దీన్ని మరో మూడేళ్ల పాటు కూడా కొనసాగించవచ్చు. ప్రస్తుతం 8.3 శాతం వడ్డీ రేటుతో ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రతీ త్రైమాసికానికి వడ్డీ చెల్లిస్తూ, రెగ్యులర్‌ ఇన్‌కంను ఇది అందిస్తోంది. అయితే, ఒక సీనియర్ సిటిజెన్‌ గరిష్టంగా రూ. 15 లక్షలు మాత్రమే పెట్టుబడి చేయాలనే పరిమితి ఉంది. అంటే, ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం
మరో ఐచ్ఛికం ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ అందించే మంత్లీ ఇన్‌కం స్కీమ్. దీనిపై వార్షికంగా 7.6 శాతం వడ్డీని చెల్లిస్తారు. ఐదేళ్ల కాలపరిమితి గల ఈ పథకంపై వచ్చే వడ్డీ, పన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 4.5 లక్షలు మాత్రమే పెట్టుబడి చేయగలరు. అంటే, ఒక జంట రూ. 9 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

పీపీఎఫ్
అధిక వడ్డీ లభిస్తుండడంతో కేవలం పెట్టుబడి రూపంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)లో పెట్టుబడి చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దీనిపై వార్షికంగా 7.9 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. ఒక వ్యక్తి పీపీఎఫ్‌లో వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి చేయవచ్చు. అయితే, పీపీఎఫ్‌పై రెగ్యులర్ ఇన్‌కం ఆప్షన్ లేదు. అలాగే లిక్విడిటీకి కూడా అవకాశం ఉండదు. అందుకే ఇది ఫిక్సెడ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయం కాబోదు. ఒకవేళ రెగ్యులర్‌గా ఆదాయం అవసరం లేకుండా, మంచి రిటర్న్‌లు కావాలని కోరుకునే వారికి మాత్రం పీపీఎఫ్ ఒక మంచి పెట్టుబడి సాధనం. దీనిపై పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, ఏటా పీపీఎఫ్ పెట్టుబడిపై గరిష్ట పరిమితి ఉంది.

డెట్ మ్యూచువల్ ఫండ్స్
ప్రస్తుత రోజుల్లో డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను కూడా ప్రజలు ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ఫిక్సెడ్ ఇన్‌కంను అందించే సాధనాలపైనే పూర్తిగా పెట్టుబడులు చేయడం డెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రత్యేకత. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పలు రకాలు ఉన్నాయి. కాల వ్యవధి ప్రకారం పెట్టుబడిని లిక్విడ్, అల్ట్రా షార్ట్-టెర్మ్, షార్ట్-టెర్మ్, మీడియం-టెర్మ్, డైనమిక్ బాండ్, కార్పొరేట్ బాండ్, డెట్ హైబ్రిడ్, ఇన్‌కం ఫండ్‌లతో పాటు ఇతర డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఫండ్ అవసరాలకు తగినట్లుగా సాధనాలు ఉండేలా ఫండ్ మేనేజర్ చర్యలు చేపడతారు. అయితే డెట్ ఫండ్స్ ‌కూడా ట్రేడ్ అయ్యేవే. అందుకే వీటి ఎన్‌‌ఏవీ రోజు వారిగా మారుతుంది. కాబట్టి నిర్ణీత మొత్తాన్ని రిటర్న్‌గా ఇవ్వడంపై హామీ ఉండదు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. అయితే, డెట్ ఫండ్లు సహజంగా మార్కెట్‌కు తగినట్లుగా, ఫిక్సెడ్ డిపాజిట్ల కంటే కొంత ఎక్కువగా రాబడులను అందిస్తాయి. ఫండ్ మేనేజర్ ఎంచుకునే ప్రత్యేక ప్రొడక్టులు, ఆయా ఉత్పత్తుల మధ్య ఫండ్ మేనేజర్ నిర్వహణ, కేపిటల్ ఎప్రిసియేషన్ రూపంలో ఇంట్రెస్ట్ సైకిల్ ద్వారా పొందే లబ్ధి, రిస్క్‌లను సమర్ధంగా నిర్వహించగలగడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. అందుకే ఈ స్కీమ్‌లు పన్నుకు ముందు సాధారణ ఫిక్సెడ్ డిపాజిట్లతో పోల్చితే 0.5-1.5 శాతం ఎక్కువగా రాబడులను అందించగలుగుతాయి.

కేపిటల్ గెయిన్స్ అనే అంశం మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో అతి పెద్ద ఆకర్షణ. డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో 36 నెలలు అంతకంటే ఎక్కువగా హోల్డింగ్ చేసినట్లయితే కేపిటల్ గెయిన్స్‌గా పరిగణించేందుకు అర్హత సాధిస్తారు. అపుడు ఇండెక్సేషన్ సాధ్యం అవతుంది. వీటిపై ప్రభావిత పన్ను 5 శాతం వరకు మాత్రమే ఉంటుంది. సహజంగా 20 నుంచి 30 శాతం వరకూ పన్ను కట్టాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పన్ను తర్వాతి ఆదాయాన్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

డెట్ ఫండ్‌‌లో సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా రెగ్యులర్ ఇన్‌కంను పొందే అవకాశం కూడా ఉంటుంది. డెట్ ఫండ్స్ ద్వారా మంచి రిటర్న్స్ లభించడమే కాదు, పన్ను ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. అవసరాలకు తగినట్లుగా ఆదాయం వచ్చేలా వీటి ఉపసంహరణ ప్లాన్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమే, ఈ పథకాలలో పెట్టుబడులు చేసేందుకు ఎలాంటి పరిమితులు ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పెద్ద కార్పస్‌ను సృష్టించాలని భావించేవారికి ఇవి అత్యంత అనుకూలం. 
 Most Popular