బోనస్ బొనాంజాల సీజన్ !

బోనస్ బొనాంజాల సీజన్ !

ప్రస్తుతం మార్కెట్లు ఆల్‌టైం గరిష్ట స్థాయిల నుంచి దిగి వచ్చాయి. హైయర్ లెవెల్స్‌లో ప్రాఫిట్ బుకింగ్.. చైనా యుద్ధ భయాలు.. కొరియా ఆందోళనలు వంటి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు.. దేశీయంగా షెల్ కంపెనీలపై సెబీ చేపట్టిన చర్యలు వంటివి అమ్మకాల ఒత్తిడిని పెంచుతున్నాయి. ఆల్‌టైం గరిష్ట స్థాయిల నుంచి నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల మేర దిగివచ్చింది. అయితే, ఏ ఏడాది ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాల పరుగు తీస్తుండడంతో, ఈ మాత్రం కరెక్షన్ అవసరమే అనే వాదన కూడా కనిపిస్తుంది. 

మరోవైపు ఈ ఏడాది పలు పీఎస్‌యూ కంపెనీలు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరించాయి. కేంద్రం నుంచి లభిస్తున్న మద్దతుతో తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను కూడా ప్రకటించాయి. అలాగే కొన్ని కంపెనీలు బోనస్ ఇష్యూలతో మదుపర్లను మురిపించాయి కూడా. వరుసగా ప్రభుత్వ రంగ సంస్థలు బోనస్ ప్రకటిస్తుండడంతో, ఈ స్టాక్స్‌లో పాజిటివ్ ట్రెండ్ మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(మొయిల్), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)లు బోనస్‌లు ప్రకటించడం విశేషం.

బీహెచ్ఈఎల్
తాజాగా బోర్డ్ సమావేశం నిర్వహించిన బీహెచ్ఈఎల్ డైరెక్టర్లు.. 1:2 నిష్పత్తిలో బోనస్‌కు రికమెండ్ చేశారు. దీనికి యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఆమోదం లభించాల్సి ఉంది. రూ. 2 ఫేస్ 
వాల్యూ కలిగిన ప్రతీ రెండు షేర్లకు 1 షేర్ చొప్పున బోనస్ జారీ చేయాలని బోర్డు ప్రతిపాదించింది.

బీఈఎల్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఇప్పటికే 1:10 నిష్పత్తిలో బోనస్‌కు రికమెండ్ చేసింది. రూ. 1 ఫేస్ వాల్యూ కలిగిన 10 షేర్లకు ఒక షేర్ చొప్పున బోనస్‌ను డైరెక్టర్లు రికమెండ్ చేశారు. ఈ ప్రతిపాదనకు కూడా యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో రిమోటింగ్ ఈ-ఓటింగ్, బ్యాలెట్ రూపంలో ఆమోదం లభించాల్సి ఉంది. 

ఎంఓఐఎల్
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రెట్టింపునకు పైగా లాభాలను ప్రకటించిన మొయిల్.. 1:1 నిష్పత్తిలో బోనస్ రికమెండ్ చేసింది. రూ. 10 ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కో షేరుకు మరొక షేర్‌ను బోనస్‌ రూపంలో జారీ చేయనున్నారు. మొయిల్ బోర్డు చేసిన ఈ ప్రతిపాదన యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. 

హెచ్‌పీసీఎల్
ఆయిల్ మార్కెటింగ్ విభాగంలోని హెచ్‌పీసీఎల్‌ ఇప్పటికే బోనస్ జారీ చేసేసింది కూడా. రూ. 10 ఫేస్ వాల్యూ కలిగిన ప్రతీ 2 షేర్లకు 1 షేర్ చొప్పున బోనస్‌ను జారీ చేసింది. 

ఆర్ఈసీ
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సంస్థ కూడా 2:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. రూ. 10 ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కో షేరుకు 1 షేర్‌ను జారీ చేసేలా బోనస్‌‌కు ఇప్పటికే ఆమోదం లభించగా.. ఆగస్ట్ 23ను ఇందుకు రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు.
 Most Popular