జె కుమార్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌‌@ 20% లోయర్ సర్క్యూట్

జె కుమార్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌‌@ 20% లోయర్ సర్క్యూట్

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డొల్ల(షెల్‌) కంపెనీలుగా ప్రకటించడంపై ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌, జేకుమార్‌ ఇన్‌ఫ్రా సెక్యూరిటీస్‌ అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌(శాట్‌) నుంచి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నాయి. తద్వారా సెబీ ఆదేశాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో ఈ కౌంటర్లలో సాధారణ ట్రేడింగ్‌కు వీలు ఏర్పడింది. వెరసి ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ అమ్మకాలకు క్యూకట్టారు. ప్రస్తుతం బీఎస్ఈలో 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకాయి. జేకుమార్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ రూ. 57 శాతం కుప్పకూలి రూ. 227 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకగా.. ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ రూ. 28(20 శాతం) కుప్పకూలింది. రూ. 111.20 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్లలో అమ్మేవాళ్లేగానీ కొనే వాళ్లు కరవు కావడం గమనించదగ్గ అంశం!
గ్రేడ్‌ 4 ఎఫెక్ట్‌
కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అందించిన జాబితా ప్రకారం మొత్తం 331 డొల్ల కంపెనీలపై సెబీ కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. వీటిపై  చర్యలు తీసుకోవాలని సెబీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సూచించింది. గ్రేడ్‌ 4లోకి వీటిని మార్చాలని సెబీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలను ఆదేశించింది. దీంతో నెల రోజుల్లో ఒకసారి మాత్రమే ఈ స్టాక్స్‌లో ట్రేడింగ్‌కు వీలుంటుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన బుధవారం నుంచి 331 స్టాక్స్‌ గ్రేడ్‌4లోకి వెళ్లడంతో ఈ నెలలో ఇకపై వీటిలో ట్రేడింగ్‌కు వీలుండదని నిపుణులు తెలియజేశారు. అంతేకాకుండా ఈ స్టాక్స్‌ లాభపడేందుకు వీల్లేకుండా పరిమితి విధిస్తారు. అంటే ఇంతక్రితం ముగింపు ధరకు మించి ఇవి పెరిగేందుకు వీలుండదు. 
ఇతర అంశాలివీ
ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్‌ కొనుగోలుచేయాలంటే అదనపు నిఘా(సర్వీలియన్స్‌) డిపాజిట్‌కింద లావాదేవీ విలువపై 200 శాతం డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఐదు నెలలపాటు ఈ డిపాజిట్‌ను ఎక్స్ఛేంజీల వద్దే నిలిపి ఉంచుతారు. ఈ కంపెనీలపై ఇకపై స్వతంత్ర ఆడిట్‌తోపాటు, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను సైతం చేపడతారు. వీటి ద్వారా అవకతవకలు బయటపడితే ఆయా స్టాక్స్‌ను తప్పనిసరిగా డీలిస్టింగ్ చేస్తారు. నల్లధనంపై పోరులో భాగంగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఎలాంటి వ్యాపారాలూ నిర్వహించని 1.62 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది కూడా.Most Popular