నాట్కోలో ఏం జరుగుతోంది ? ఎక్కడికీ పతనం - PYT Exclusive

నాట్కోలో ఏం జరుగుతోంది ? ఎక్కడికీ పతనం - PYT Exclusive

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం నాట్కో గత కొద్ది రోజులుగా నెగిటివ్ కారణాలతో మార్కెట్లో నిలిచింది. మెరుగైన త్రైమాసిక ఫలితాలనే ప్రకటించినప్పటికీ అనేక కారణాలతో స్టాక్ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. రెండు సెషన్లలోనే సుమారు 30 శాతం వరకూ స్టాక్ పతనం కావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 
ఫండమెంటల్‌గా పటిష్ట స్థితిలో ఉన్న ఈ సంస్థలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 
రెండు రోజుల క్రితం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మెరుగ్గా ఉండడంతో పాటు నికర లాభం దాదాపుగా రెట్టింపు అయింది. నిరుడు మొదటి త్రైమాసికంలో రూ.47.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.97.03 కోట్లకు పెంచింది. అయితే సీక్వెన్షియల్ బేసిస్‌లో (గతేడాది నాలుగో క్వార్టర్‌తో పోలిస్తే)మాత్రం నెట్ ప్రాఫిట్‌లో 47 శాతం, ఆదాయంలో 22 శాతం క్షీణించింది. 

టామిఫ్లూ... జ్వరం తెప్పిస్తోంది 
ఫ్లూ వ్యాధిని నివారించే టామిఫ్లూ డ్రగ్‌ను యూఎస్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మేందుకు నాట్కోకు అనుమతి ఉంది. గిలెడ్, రోషె సంస్థలపై కోర్టులో నెగ్గి మరీ యూఎస్ మార్కెట్లో తమ జెనిరిక్ వర్షన్‌ ఔషధాలను అమ్మే ఎక్స్‌క్లూజివిటీని దక్కించుకుంది నాట్కో. ఈ నేపధ్యంలో గతేడాది మూడు, నాలుగు క్వార్టర్లలో అనూహ్యమైన లాభాలను మూటగట్టుకోగలిగింది సంస్థ. 
అయితే ఇప్పుడు ఆ ఎక్స్‌క్లూజివిటీని నాట్కో కోల్పోయింది.    ఇతర సంస్థలతో పోటీపడి మామూలుగానే తమ జెనిరిక్ వర్షన్లను అమ్ముకోవాల్సి ఉంటుంది. దీంతో యూఎస్ నుంచి వస్తున్న మేజర్ ఆదాయానికి గండిపడినట్టైంది. ఇది నాట్కోకు ఒక మేజర్ షాక్. 

డైరెక్టర్లు వెళ్లిపోయారు !
కంపెనీతో ఎంతో కాలం నుంచి అనుబంధంగా ఉన్న డైరెక్టర్, ఆర్ అండ్ డి డిపార్ట్‌మెంట్ ప్రెసిడింట్ డా. భుజంగరావు అనూహ్యంగా రాజీనామా చేశారు. యూఎస్ మార్కెట్లో ఇంతకాలం రీసెర్చ్, డెవలప్‌మెంట్‌పై పెట్టిన ఖర్చును సగానికి సగం తగ్గించేయాలని నాట్కో నిర్ణయించింది. తమ బడ్జెట్లో ఇకపై 50 శాతం మొత్తానికి ఇండియాలోని ఆర్ అండ్ డిపైనే ఖర్చు చేయాలని ఖరారు చేసుకుంది. ఇది కూడా సదరు డైరెక్టర్‌కు - కంపెనీకి మధ్య అగాధాన్ని ఏర్పర్చిందని వార్తలు వస్తున్నాయి. 

వీటికి తోడు సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్ డా.బిఎస్ బజాజ్ కూడా రాజీనామా లేఖను సమర్పించారు. 

వ్యక్తిగత కారణాలు చూపుతూ ఇద్దరు డైరెక్టర్లూ తక్షణం బోర్డు నుంచి వైదొలగడం కూడా అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. 

ఇవన్నీ వెరిసి స్టాక్‌ను షేక్ చేస్తున్నాయి. 2016 నవంబర్‌లో రూ.500 కనిష్ట స్థాయి నుంచి రూ.1080 (జూన్2017) స్థాయికి పెరిగిన స్టాక్‌లో ఇప్పుడు అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. వెయ్యి రూపాయల మార్కును దాటినప్పటి నుంచి నాట్కోలో నీరసం మొదలైంది. గరిష్ట స్థాయిల నుంచి 30 శాతం వరకూ కోల్పోయిన స్టాక్‌ ప్రస్తుతం రూ.695 దగ్గర కదలాడుతోంది. ఇక్కడి నుంచి కూడా మరో 10 శాతం వరకూ డౌన్ సైడ్ రిస్క్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

- నాగేంద్ర సాయిMost Popular