మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లకే సెబీ వాతలు ఎందుకు?

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లకే సెబీ వాతలు ఎందుకు?

331 కంపెనీలను షెల్ కంపెనీలుగా అనుమానిస్తూ, ఆయా కంపెనీలలో ట్రేడింగ్‌పై ఆంక్షలు విధిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. వీటిలో 162 స్టాక్స్ యాక్టివ్‌గా ట్రేడ్ అవుతుండగా, 169 కంపెనీలపై ఇప్పటికే పలు రకాల లిస్టింగ్ అగ్రిమెంట్స్ ఉల్లంఘన కారణంగా సస్పెషన్ అమలులో ఉంది. తాజాగా మరో 5 కంపెనీలను ఈ జాబితాలోకి చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో కూడా నెలకు ఒక రోజు మాత్రమే ట్రేడింగ్ అనుమతించనున్నారు. 

సెబీ ఆర్డర్ ఏం చెబుతోంది?
షెల్ కంపెనీలుగా అనుమానితుల జాబితాలో ఉన్న స్టాక్స్ అన్నిటిలోను నెలకు ఒక రోజు మాత్రమే, ప్రతీ నెలా మొదటి సోమవారం మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతిస్తారు

ఈ జాబితాను సిద్ధం చేసిందెవరు?
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఇలాంటి కఠిన చర్యకు కారణం ఏంటి?
లెక్కల్లో చూపని ఆదాయాన్ని పెట్టుబడులుగా చేసేందుకు అంగీకరిస్తూ, పన్ను ఎగవేతదారులకు ఉద్దేశ్యపూర్వకంగా సహకరిస్తున్నాయని కేంద్రం అనుమానించింది.

ఈ 336 కంపెనీల స్టాక్స్‌ను కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?
ట్రేడ్ విలువకు అదనంగా మరో 200 శాతం అదనపు మార్జిన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే రూ. 10,000 విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు, మరో రూ. 20,000లను ఎక్స్‌ఛేంజ్ వద్ద డిపాజిట్ చేయాలి. కొనుగోలుదారులకు ఈ మార్జిన్ మనీని ఐదు నెలల తర్వాత తిరిగి చెల్లిస్తారు.

సెల్లర్స్ పరిస్థితి ఏంటి? వారి అమౌంట్‌కి కూడా లాక్-ఇన్ పీరియడ్ ఉంటుందా?
లేదు, షేర్లను విక్రయించిన వారికి మరుసటి రోజున వారి సొమ్ము ఖాతాలో జమవుతుంది. అయితే, కొనుగోలు కోసం రెండు రెట్ల మార్జిన్‌ తప్పనిసరి నిబంధన కారణంగా.. ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేసేవారు లభించడం కష్టసాధ్యమైన విషయం.

ఈ జాబితాలో కంపెనీలు ఎంత కాలం ఉంటాయి?
ఈ కంపెనీల 'క్రెడెన్షియల్స్/ఫండమెంటల్స్'ను ఎక్స్‌ఛేంజ్‌లు సర్టిఫై చేసేవరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆడిట్ నిర్వహణ కోసం ఇండిపెండెంట్ ఆడిటర్‌ను నియమించాలంటే ఎక్స్‌ఛేంజ్‌లకు సెబీ సూచించింది. ఒకవేళ అవసరం అయితే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని తెలిపింది.

తమ 'క్రెడెన్షియల్స్/ఫండమెంటల్స్'ను కంపెనీలు నిరూపించుకోలేకపోతే పరిస్థితి ఏమిటి?
ఆయా కంపెనీలను తప్పనిసరిగా డీలిస్ట్ చేయాల్సిందిగా సెబీ ఇప్పటికే సూచించింది. 

కంపెనీలు తమ 'క్రెడెన్షియల్స్/ఫండమెంటల్స్'ను ఎలా నిరూపించుకోవాలి?
ఈ అంశంపై ఇంకా స్పష్టత లేదు. సెబీతో పాటు స్టాక్ ఎక్స్‌ఛేంజ్ అధికారులు ఇందుకోసం నియమావళిని రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు.

సెబీ చర్యల కారణంగా మార్కెట్ ప్రతిస్పందన ఏంటి?
అనేక మంది లీగల్ ఎక్స్‌పర్ట్స్ ఈ చర్యను తప్పు పడుతున్నారు. కంపెనీల చట్టం, సెబీ యాక్ట్ ప్రకారం షెల్ కంపెనీలకు నిర్వచనం లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే, ఈ జాబితాలో ఉన్న కొన్ని కంపెనీలు నిజాయితీగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని అంటున్నారు.

తర్వాత ఏం జరగనుంది?
అనేక కంపెనీలు సెబీ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ముందు సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

సెబీ నిర్ణయంతో మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉంది?
సోమవారం నాడు సాయంత్రం సెబీ ఈ నిర్ణయాన్ని వెలువరించిన తర్వాత, మంగళవారం నుంచి స్టాక్ మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే ఎందుకు అమ్మకాలు?
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ మరిన్ని కఠిన నిబంధనలు విధించనుందనే అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీల షేర్లు గత కొన్ని నెలలుగా భారీగా పెరిగాయి. వాటి ఆదాయ అంచనాలకు మించిన ధరల్లో ట్రేడవుతున్నాయి.

మరోవైపు ఇతర షేర్లకు కూడా ఈ ప్రభావం చుట్టుకుంటోంది. ఈ 336 కంపెనీలలో పెట్టుబడులు చేసిన మదుపుదారుల్లో చాలామంది అప్పు చేసిన మొత్తంతో షేర్లను కొనుగోలు చేసిన వారు ఉన్నారు. తమ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను బ్రోకర్ దగ్గర తాకట్టులో ఉంచి ఈ షేర్లను కొనుగోలు చేసిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడీ 336 స్టాక్స్ నెలకు ఒకసారి మాత్రమే.. అది కూడా కొనుగోలుదారులు లభిస్తే మాత్రమే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో తమ దగ్గర తాకట్టులో ఉన్న షేర్లను విక్రయించి, తమ సొమ్మును రికవర్ చేసుకునేందుకు స్టాక్ బ్రోకర్లు ప్రయత్నిస్తున్నారు.
 Most Popular