అమ్మకాల వెల్లువ-నెల రోజుల కనిష్టానికి!

అమ్మకాల వెల్లువ-నెల రోజుల కనిష్టానికి!

చివర్లో అమ్మకాలు మరింత ఊపందుకోవడంతో మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనంకాగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,800 స్థాయిని సైతం కోల్పోయింది. చివరికి సెన్సెక్స్‌ 266 పాయింట్లు క్షీణించి 31,531 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 88 పాయింట్లు పతనమై 9,820 వద్ద స్థిరపడింది. ఉత్తరకొరియా, అమెరికా మధ్య యుద్ధవాతావరణం, డోక్లామ్‌ వద్ద చైనాతో వివాదం వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ మార్కట్లలోనూ అమ్మకాలు నమోదవుతున్న నేపథ్యంలో వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఆపై అమ్మకాలు ఉపశమించకపోవడంతో నేలచూపులకే పరిమితమయ్యాయి. 
రియల్టీ బేర్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ అత్యధికంగా 5 శాతం కుప్పకూలగా.. ఆటో, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్సులు దాదాపు 3 శాతం స్థాయిలో పతనమయ్యాయి. మెటల్స్‌ సైతం 1.6 శాతం నీరసించగా.. ఐటీ రంగం ట్రెండ్‌కు ఎదురునిలిచి 0.5 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 8 శాతం పతనమై రూ. 382 వద్ద ముగిసింది. ఇది 15 నెలల కనిష్టంకాగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, బీవోబీ, గెయిల్‌, ఐషర్‌, సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, సిప్లా, ఏసీసీ 5-2.5 శాతం మధ్య దిగజారాయి. అయితే టెక్‌మహీంద్రా, అరబిందో, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3-1 శాతం మధ్య బలపడ్డాయి.
చిన్న షేర్లు బోర్లా
మార్కెట్లను మించుతూ చిన్న షేర్లు బోర్లా పడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు దాదాపు 3 శాతం పడిపోయాయి. ట్రేడైన మొత్తం షేర్లలో ఏకంగా 2181 నష్టపోతే.. కేవలం 390 లాభాలతో ముగిశాయి. 
ఎఫ్‌ఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 841 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 553 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి.Most Popular