రోడ్డున పడ్డ రేమండ్స్ ఫౌండర్!

రోడ్డున పడ్డ రేమండ్స్ ఫౌండర్!


రేమండ్స్.. ఇప్పుడంటే వందల కొద్దీ క్లోతింగ్ బ్రాండ్స్ జనాలకు కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. కానీ రెండు దశాబ్దాల క్రితమే బ్రాండెడ్ గార్మెంట్స్‌ రంగంలో రేమండ్స్ సంచలనం. ఇప్పటికీ రేమండ్స్ బ్రాండ్‌కు ఏ మాత్రం వాల్యూ తగ్గలేదంటే, ఈ రంగంలో రేమండ్స్ ఏ స్థాయిలో పాతుకుపోయిందో అర్ధమవుతుంది. బాలీవుడ్ సినిమాల్లోను, టీవీల్లోనూ అడ్వర్టెయిజ్‌మెంట్స్‌తో రేమండ్స్ సెన్సేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి కంపెనీని స్థాపించిన వ్యక్తి పేరు డా. విజయ్‌పత్ సింఘానియా. 

ఇప్పుడాయన నడిరోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. వేల కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించిన బిజినెస్ టైకూన్‌కు కనీస అవసరాలకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితి ఎదురవడం చూస్తే, ఏదో సినిమా స్టోరీ విన్నట్లుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇది మాత్రం పక్కా వాస్తవం.

సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి కథ డా. విజయ్‌పత్ సింఘానియాకు నిజ జీవితంలో ఎదురవుతోంది. ఒక డూప్లెక్స్ కోసం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. అది కూడా తన సొంత కుమారుడి పైనే బాంబే హైకోర్టులో కేసు వేశారు సింఘానియా. మలబార్ హిల్‌ ప్రాంతంలో అభివృద్ధి చేసిన 36 అంతస్తుల జేకే హౌస్‌లో డూప్లెక్స్‌ల విషయం తాము మోసపోయామంటూ ఈయన కోర్టు మెట్లు తొక్కారు.

రూ. 1000 కోట్ల విలువ కలిగిన కంపెనీని, అందులోని అన్ని షేర్లను తన కుమారుడుకి కట్టబెట్టేశారు సింఘానియా. ఇప్పుడు కనీసం నిలబడేందుకు నీడ కూడా లేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కనీసం ఓ కారు, దానికో డ్రైవర్‌ కూడా లేడండం సింఘానియా సిట్యుయేషన్ అర్ధమవుతుంది. ముంబైలో ఓ అద్దె ఇంట్లో కాలం వెళ్లబుచ్చుతున్న ఈయన.. రీసెంట్‌గా గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. 

ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన విజయ్‌పత్ సింఘానియా.. ఇప్పుడు తను ఎదుర్కొంటున్న పరిస్థితికి కొడుకే కారణమని అంటున్నారు.

ఆ బిల్డింగే గొడవకు కారణం
1960లో నిర్మాణం పూర్తి చేసుకున్నపుడు జేకే హౌస్ 14 అంతస్తుల భవనం. ఇందులో 4 డూప్లెక్స్‌లను రేమండ్ సబ్సిడరీ పార్థియన్‌ హోల్డింగ్స్‌కు అందచేశారు. 2007లో ఈ కంపెనీ పునర్ అభివృద్ధికి తలపెట్టింది. ఈ డీల్ ప్రకారం డా. సింఘానియా, గౌతమ, సోదరుడి భార్య యిన అజంతా సింఘానియా, కుమారులు అనన, అబ్‌ఖజియాలకు.. ఒక్కో రూ. 9000/చ.అ. చొప్పున చెల్లింపుతో 5,185 చ.అ. విస్తీర్ణం కలిగిన డూప్లెక్స్‌లు దక్కాల్సి ఉంది. కానీ జేకే హౌస్‌ను అభివృద్ధి చేసిన తర్వాత.. కుమారుడు గౌతమ్ తనకు కేటాయించిన మొత్తం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించేయడంతో.. విజయ్‌పత్‌కు రోడ్డున పడాల్సి వచ్చింది.

తన కుమారుడి కోసం మొత్తం ఆస్తిని అంతా సింఘానియా త్యాగం చేస్తే.. ఇప్పుడా కొడుకు ఆయనను ఏమీ లేని స్థితికి చేరుస్తున్నాడని న్యాయవాదులు అంటున్నారు. ఈయన డాక్యుమెంట్స్, పర్సనల్ ఫైల్స్‌ను నిర్వహించిన ఇద్దరు రేమండ్ ఉద్యోగులు కూడా మిస్ కావడంతో, ఆయా పత్రాలను పొందేందుకు వీలు లేకుండా పోయిందని చెబుతున్నారు. కొడుకు గౌతమ్ హరాస్‌మెంట్, ఒత్తిడి చేస్తున్నారని లాయర్లు అంటున్నారు. 

నెపియన్ సీ రోడ్‌లో ఓ ఇంటిలోకి నెలకు రూ. 7 లక్షలకు అద్దెకు ఉంటున్న విజయ్‌పత్ సింఘానియా.. ఇప్పటివరకూ చెల్లించిన అద్దెను కూడా రీఎంబర్స్ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం విజయ్‌పత్ సింఘానియా వైపు మాత్రమే వాదనలు తెలియడంతో.. అందరూ షాక్ తినాల్సిన పరిస్థితి. మరి ఈ కేసులో వాస్తవాలు ఏంటో తెలియాల్సి ఉంది.Most Popular