ఐపీఓకు వస్తున్న న్యూఇండియా అస్యూరెన్స్

ఐపీఓకు వస్తున్న న్యూఇండియా అస్యూరెన్స్


ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన 'న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్' ఐపీఓకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఐపీఓ కోసం దరఖాస్తున్న అందచేసింది న్యూ ఇండియా అస్యూరెన్స్. 

ఇప్పటికే ఒక ప్రభుత్వ రంగ బీమా కంపెనీ అయిన 'జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' ఐపీఓ కోసం సోమవారం నాడు దరఖాస్తు సమర్పించగా, ఇప్పుడు న్యూఇండియా అస్యూరెన్స్ కూడా తన ఐపీఓ దరఖాస్తును అందచేసింది.

ఐపీఓ డీటైల్స్

రూ. 5 ఫేస్ వాల్యూ కలిగిన 12 కోట్ల షేర్లను న్యూ ఇండియా ఆఫర్ చేయనుంది. ఇందులో 2.4 కోట్ల తాజా షేర్లను ఇష్యూ చేయనుండగా, 9.6 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఐపీఓ ద్వారా 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 6,300 కోట్లను న్యూ ఇండియా అస్యూరెన్స్ సమీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇష్యూ తర్వాత షేర్ క్యాపిటల్‌లో ఇది 14.56 శాతానికి సమానం కాగా.. నవంబర్ మధ్యలో ఈ ఐపీఓ మార్కెట్లను తాకే అవకాశం ఉంది.

మర్చంట్ బ్యాంకర్స్:
కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, యాక్సిస్ క్యాపిటల్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, నోమురా ఫైనాన్షియల్, యస్ సెక్యూరిటీస్

ఫైనాన్షియల్స్:
2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 839.86 కోట్ల నికర లాభాలను న్యూ ఇండియా అస్యూరెన్స్ ప్రకటించగా.. అంతకు ముందు ఏడాది రూ. 930.35 కోట్లతో పోల్చితే ఇది 9.72 శాతం తక్కువ. 2016-17లో రూ. 23,230.49 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని కంపెనీ గడించగా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 19,227.26 కోట్లుగా ఉంది. 

నికరంగా ఆర్జించిన ప్రీమియంపై ఓట్‌ఫ్లో 2016-17లో 119.96 గా ఉండగా.. అంతకు ముందు ఏడాది ఇది 117.99. షార్ట్-టెర్మ్, లాంగ్-టెర్మ్‌ లయబిలిటీస్‌ను అందుకునేందుకు ఆర్థిక సామర్ధ్యాన్ని తెలిపే సాల్వెన్సీ రేషియో 2.22గా ఉంది. అయితే, ఐఆర్‌డీఏఐ ఆమోదిత ప్రామాణిక సాల్వెన్సీ రేషియో 1.5 అనే విషయం గుర్తుంచుకోవాలి. 

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తర్వాత ఐపీఓకు వస్తున్న రెండో ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీగా న్యూ ఇండియా అస్యూరెన్స్ నిలవనుంది. నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ వ్యాపారాలను లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నాల్లో ఉన్నాయి. 
 Most Popular