ఇక స్టాక్స్, ఫండ్స్ కొనేందుకూ ఆధార్!!

ఇక స్టాక్స్, ఫండ్స్ కొనేందుకూ ఆధార్!!
  • ప్రస్తుతం ఆర్థిక మార్కెట్ల లావాదేవీలకు ఆధార్ తప్పనిసరి కాదు
  • స్టాక్‌మార్కెట్‌లో నేరపూరిత లావాలేదీలను అరికట్టేందుకు చర్యలు
  • ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఆన్‌లైన్‌ కేవైసీ కోసం ఉపయోగపడుతున్న ఆధార్
  • పాన్‌ను ఆధార్‌తో రీప్లేస్ చేయనున్నారా అనే అంశంపై లేని స్పష్టత
  • పాన్, బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ నెంబర్స్‌కు ప్రస్తుతం ఆధార్ తప్పనిసరి

 

పాన్‌కార్డు సహా ఇప్పటికే అనేక ప్రధాన రంగాల్లో ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేశారు. త్వరలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లకు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్లలో లావాదేవీలకు ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేసేందుకు సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చర్యలు చేపడుతోంది. తద్వారా స్టాక్ మార్కెట్లలోకి బ్లాక్‌మనీ రాకుండా అడ్డుకోవాలన్నది సెబీ యోచనగా తెలుస్తోంది. 

ట్యాక్స్ లీక్‌లను అడ్డుకునేందుకు పాన్ నెంబర్‌ను మాత్రమే ఆధార్‌కు లింక్ చేస్తే సరిపోదనే విషయాన్ని సెబీ, కేంద్ర ప్రభుత్వం గుర్తించాయి. అందుకే ఆర్థిక మార్కెట్లలో లావాదేవీలకు ఆధార్ సంఖ్యను లింక్ చేయడంపై సాధ్యాసాధ్యాలను వెల్లడించాలని మార్కెట్ ఇంటర్మీడియరీస్‌ను సెబీ కోరింది.

పాన్‌ను ఆధార్‌తో రీప్లేస్ చేయనున్నారా?

ఆధార్‌ను తప్పనిసరి చేసేందుకు తగిన చర్యలను సూచించాలని సెబీ నుంచి తమకు ఆదేశాలు అందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందుకోసం నిర్ణీత కాలవ్యవధిని ఏదీ నిర్ణయించలేదు. మరోవైపు ఆర్థిక మార్కెట్ల లావాదేవీల కోసం పాన్ సంఖ్యను ఆధార్‌తో రీప్లేస్ చేసే అంశంపై కూడా ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. 

బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ నెంబర్లు, పాన్‌ నెంబర్‌లకు ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న బ్యాంక్ ఖాతాలకు ఆధార్ వివరాలను సమర్పించేందుకు డిసెంబర్ 31ని తుది గడువుగా నిర్ణయించారు. 

ఆన్‌లైన్‌లో జరుగుతున్న మ్యూచువల్ ఫండ్ లావేదేవీలను పరిశీలించేందుకు ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఈ-కేవైసీ గా గుర్తింపు పొందిన ఆన్‌లైన్ నో యువర్ క్లైంట్‌ విధానాన్ని పూర్తి చేసిన వారు ఫండ్ హౌస్‌లకు వెళ్లి భౌతికంగా తమ సంతకాలతో కూడిన ఫామ్స్‌ను అందించాల్సిన అవసరం లేదు.

ఇంకా ఉపయోగంలో బహుళ పాన్‌లు
ఈ-కేవైసీని తమ పరిశ్రమలో కూడా ఉపయోగించాలని కొంతమంది స్టాక్ బ్రోకర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మార్కెట్‌లో ఉన్న కొన్ని లోపాలను సవరించేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం అనే అంశం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. 

"భారత్‌ను అవినీతి రహిత దేశంగా మార్చడంలో ఆర్థిక మార్కెట్ల లావాదేవీలను ఆధార్‌తో లింక్ చేయడం కీలక పాత్ర పోషించనుంది" అని ఇండియా ఇన్ఫోలైన్ అంటోంది. 

ఇన్‌కం ట్యాక్స్ అసెస్‌మెంట్‌ కోసం సమర్పించే పర్మనెంట్ అకౌంట్ నెంబర్(పాన్) ప్రతీ ఒకరికి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే, ఇది స్టాక్ మార్కెట్లలో మనీ లాండరింగ్ జరగకుండా అడ్డుకోవడంలో ఇది పూర్తిగా విజయవంతం కాలేకపోయింది. ఇప్పటికీ పలువురు ఒకటి కంటే ఎక్కువ పాన్‌లు, ఫేక్ డీమ్యాట్ అకౌంట్‌లను ఉపయోగిస్తూ, చట్టవ్యతిరేక సొమ్మును స్టాక్‌మార్కెట్లలోకి తరలిస్తున్నారని స్టాక్ బ్రోకర్లు చెబుతు్ననారు.

ఆధార్‌ను ఒకటే ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్‌గా ఉపయోగించేలా కేంద్రం చర్యలు చేపట్టాలనే సూచనలు అందుతున్నాయి.

"పాన్ సహా ఇతర గుర్తింపు ధృవీకరణ పత్రాలను ఆధార్‌తో రీప్లేస్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఆర్థిక మార్కెట్లకు మాత్రమే కాకుండా, ఆయా వ్యక్తులకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధార్‌ను తప్పనిసరి చేస్తే, ఎంత మంది కస్టమర్లు మిగులుతారనే అంశంపై చాలామంది చిన్న బ్రోకర్లలో ఆందోళన ఉంది. ఈ చర్య చేపడితే ఐపీఓ సహా అన్ని రకాల ఆర్థిక మార్కెట్లలోను కొంత తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. అయితే ఇది తాత్కాలికం మాత్రమే" అని స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు. 

నిజానికి ప్రతీ ఆర్థిక లావాదేవీని ఆధార్‌తో అనుసంధానం చేయడం అనే అంశం, ఆడిట్ ట్రయల్స్‌లో కొన్ని ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది మళ్లీ పన్ను ఎగవేతకు సహకరించే అవకాశాలుంటాయి. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ వ్యవస్థలలో నేరపూరిత లావాదేవీలను అరికట్టేందుకు డేటా సెక్యూరిటీ చాలా ముఖ్యమైన విషయం. ఇది కస్టమర్ ఆర్థిక చరిత్రకు సంబంధించిన విషంయ. తమ డేటాను దుర్వినియోగం చేస్తే వాటిపై ఫిర్యాదులు చేసేందుకు వీలుగా తమ వ్యక్తిగత వివరాలపై పౌరులకు హక్కు ఉండాలి. మరి కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందా?
 Most Popular