ప్రమోటర్లు తప్పు చేస్తే.. శిక్ష ఇన్వెస్టర్లకా?

ప్రమోటర్లు తప్పు చేస్తే.. శిక్ష ఇన్వెస్టర్లకా?

331 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, ట్రేడింగ్‌పై ఆంక్షలు విధించాలంటూ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లను ఆదేశిస్తూ సెబీ  తీసుకున్న నిర్ణయం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు, రెండు రోజులుగా మార్కెట్‌లో నెగిటివ్ ట్రెండ్‌కు కూడా కారణమైంది. కొన్ని పేరొందిన స్మాల్‌క్యాప్ కంపెనీలను కూడా ఈ జాబితాలో చేరుస్తూ హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా, అనేకమంది మార్కెట్ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. గ్రేడెడ్ సర్వైలెన్స్ మెజర్‌లో భాగంగా షెల్ కంపెనీలుగా అనుమానిస్తూ.. అనేక కంపెనీలలో ట్రేడింగ్‌ను సస్పెండ్ చేశారు. ఈ ట్రేడింగ్ ఆంక్షలు అమలులో ఉన్న స్టాక్స్‌లో ట్రేడ్స్ జరిపేందుకు విభిన్నమైన నిబంధనలు ఉంటాయి.

కొనాలంటే 200 శాతం డిపాజిట్

ఉదాహరణకు 5, 6వ స్టేజ్‌లలో ఉన్న స్టాక్స్‌లో ట్రేడ్ చేసేందుకు, ట్రేడింగ్ విలువలో 200 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, వీటిలో అనేక స్టాక్స్‌ను నెలకు కేవలం ఒక రోజు మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతిస్తారు. మనీ లాండరింగ్‌ను అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే, సెబీ తాజా నిర్ణయం వెలువడింది. అయితే, ఆయా కంపెనీలు ఎదుర్కొంటున్న ఎలాంటి ఆరోపణలను సెబీ తెలియచెప్పకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. సెబీ చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఈ కంపెనీలు భారీగా ఆస్తులు లేకపోయినా పన్ను ఎగవేతలకు కారణం అవుతున్నాయని మాత్రమే. 

ప్రభావం చూపగల బడా మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా పెట్టుబడులు చేసిన కొన్ని కంపెనీలపై కూడా ఇప్పుడు ఆంక్షలు విధించారు. ఈ కంపెనీలు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నాయనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వం డిమానిటైజేషన్ ప్రకటించినపుడు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడ్డాయనే వాదన కూడా మార్కెట్లలో చక్కర్లు కొడుతోంది. అయితే, పన్నుల ఎగవేతకు సహకరిస్తున్నాయంటూ.. పలు కంపెనీలపై సెబీ-ఎక్స్‌ఛేంజ్‌లు కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం విశేషం. గతంలో ఇలా నిషేధం విధించడం అనే చర్యను సెబీ చిట్టచివరి చర్యగా తీసుకునేది. కానీ ఇప్పుడు రాత్రికిరాత్రే ఇలాంటి నిర్ణయం ప్రకటించడంతో.. చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టేవారికి షాక్ ఇచ్చారనే చెప్పాలి.

ఎగ్జిట్ అయేందుకు ఛాన్స్ ఇవ్వలేదు

అయితే, తప్పు చేసిన కంపెనీల ప్రమోటర్లపై చర్యలు తీసుకోవడంతో.. రిటైల్ ఇన్వెస్టర్లు హతాసులు కావాల్సి వచ్చింది. వారికి ఆయా స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో.. పెట్టుబడులు స్తంభించిపోయాయి. ఇలా ఎటువంటి ఆదాయాలు, ఆస్తులు లేని కంపెనీల్లో పెట్టుబడులు చేయడాన్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంది. ఇలాంటి కంపెనీలు ఆ జాబితాలో చాలానే ఉన్నాయి. అయితే, అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్న స్టాక్స్‌గా భావించిన కొన్ని కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడీ కంపెనీల్లో నెలకు ఒకసారి మాత్రమే ట్రేడ్ కానుండడంతో, బయ్ ఆర్డర్ల కంటే సెల్ ఆర్డర్లు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం లేదు. రెగ్యులేటరీ నిర్ణయించినట్లుగా 200 శాతం మార్జిన్‌ను డిపాజిట్ చేసి వీటిని కొనుగోలు చేసేందుకు కొందరు ఇన్వెస్టర్లు ముందుకు రావచ్చు. అయితే, ప్రమోటర్లు చేసిన తప్పిదాలకు రిటైల్ ఇన్వెస్టర్లు పెనాల్టీ చెల్లించాల్సి వస్తోందనే మాట మాత్రం వాస్తవమే.

భవిష్యత్తులో సెబీ ఇలాంటి చర్యలను చేపట్టేందుకు ముందు, పబ్లిక్ షేర్‌హోల్డర్ల తక్షణ అవసరాలను కూడా పరిశీలించాలని, పలువురు మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
 Most Popular