10,000 దిగువన నిఫ్టీ - బ్యాంక్స్‌ బేర్‌!

10,000 దిగువన నిఫ్టీ - బ్యాంక్స్‌ బేర్‌!

మిడ్ సెషన్‌ నుంచీ ఊపందుకున్న అమ్మకాలు చివరి వరకూ కొనసాగడంతో మార్కెట్లు నీరసించి ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 259 పాయింట్లు కోల్పోయి 32,014 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 79 పాయింట్లు పతనమై 9,978 వద్ద స్థిరపడింది. తద్వారా నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 10,000 పాయింట్ల దిగువన ముగిసింది. కాగా.. తొలుత ఒక దశలో సెన్సెక్స్‌ సైతం 32,000 పాయింట్ల మైలురాయిని కోల్పోయిన సంగతి తెలిసిందే.
మెటల్స్‌ హవా
మార్కెట్లు పతనబాటన సాగినప్పటికీ ప్రోత్సాహకర ఫలితాల కారణంగా మెటల్‌ కౌంటర్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 1.5 శాతం పుంజుకోగా.. మిగిలిన అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. ప్రధానంగా రియల్టీ 4.4 శాతం దిగజారింది. ఈ బాటలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.4 శాతం, బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 1.2 శాతం చొప్పున క్షీణించాయి.
కుప్పకూలిన రియల్టీ 
రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్‌ 20 శాతం కుప్పకూలగా.. యూనిటెక్, డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, డెల్టాకార్ప్‌, శోభా, ఒబెరాయ్‌ 10-1.5 శాతం మధ్య పతనమయ్యాయి.  
బ్లూచిప్స్‌ తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఐవోసీ, కోల్‌ ఇండియా, టాటా పవర్‌, బీవోబీ, ఐటీసీ, యస్‌బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్‌ 5.3-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోపక్క మెటల్‌ దిగ్గజాలు వేదాంతా, హిందాల్కో, టాటా స్టీల్‌ 3 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. సిప్లా 2.5 శాతం పుంజుకోగా.. ట్రయంప్‌తో జత కట్టడంతో బజాజ్‌ ఆటో 1 శాతం బలపడింది. 
ఎఫ్‌ఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో గడిచిన శుక్రవారం(4న) రూ. 854 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం రూ. 199 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే మరోవైపు శుక్రవారం రూ. 1,017 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సోమవారం మరోసారి రూ. 308 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular