స్వల్ప నష్టాలతో సరి- చిన్న షేర్ల హవా‌!

స్వల్ప నష్టాలతో సరి- చిన్న షేర్ల హవా‌!

రోజంతా పరిమిత స్థాయిలో హెచ్చుతగ్గులు చవిచూసిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెంటిమెంటును ప్రభావితం చేయగల ప్రధాన అంశాలు లేకపోవడంతో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో మార్కెట్లు నామమాత్ర ఆటుపోట్లకు లోనయ్యాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 52 పాయింట్లు క్షీణించి 32,274 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 9 పాయింట్ల నామమాత్ర నష్టంతో 10,057 వద్ద స్థిరపడింది. అయితే రియల్టీ, పీఎస్‌యూ షేర్లకు భారీ డిమాండ్‌ పుట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ రెండు రంగాలూ 1.55 శాతం చొప్పున ఎగశాయి. మరోపక్క మెటల్‌ సైతం 1.2 శాతం పుంజుకోగా.. ఐటీ 0.75 శాతం నీరసించింది.
నిఫ్టీ దిగ్గజాలలో
బ్లూచిప్‌ షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐబీహౌసింగ్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, లుపిన్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. ఫలితాలపై అంచనాలతో టాటా స్టీల్ 4.35 శాతం జంప్‌చేసి రూ. 601కు చేరింది. తద్వారా దాదాపు ఆరేళ్ల గరిష్టాన్ని అందుకోగా‌, ఐవోసీ, స్టేట్‌బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ, ఐషర్‌, మారుతీ, కోల్‌ ఇండియా 2.6-0.8 శాతం మధ్య లాభపడ్డాయి.
డిమాండ్‌
కన్సాలిడేషన్‌ బాట పట్టిన మార్కెట్లలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ హవాచూపాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.1 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,559 లాభపడితే.. 1,041 నష్టపోయాయి.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు
గడిచిన శుక్రవారం(4న) నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 854 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే ఇందుకు ధీటుగా దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,017 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. Most Popular