ఐపీవో బాటలో మహీంద్రా లాజిస్టిక్స్‌

ఐపీవో బాటలో మహీంద్రా లాజిస్టిక్స్‌

మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద మహీంద్రా లాజిస్టిక్స్‌ ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఐపీఓలో భాగంగా మొత్తం 1.93 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. మాతృ సంస్థ ఎంఅండ్‌ఎం 9.66 మిలియన్‌ షేర్లను, నార్మండీ హోల్డింగ్స్‌, కేదార కేపిటల్‌ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, కేదారా కేపిటల్‌ 9.27 మిలియన్‌, 0.39 మిలియన్‌ ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి మహీంద్రా లాజిస్టిక్స్‌ ఇష్యూ ద్వారా 27.49 శాతం వాటాను అమ్మకానికి పెట్టనుంది.

 పబ్లిక్‌ ఇష్యూ నిర్వహణకు కొటక్‌ మహీంద్రా కేపిటల్‌, యాక్సిస్‌ కేపిటల్‌ కంపెనీలను మహీంద్రా లాజిస్టిక్స్‌ ఎంపిక చేసుకుంది. 2014లో పీఈ సంస్థ కేదార కేపిటల్‌ మహీంద్రా లాజిస్టిక్స్‌లో 23 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 200 కోట్లను వెచ్చించింది. మహీంద్రా లాజిస్టిక్స్‌ ఆటో, ఆటో విడిభాగాలు, కన్జూమర్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఈకామర్స్‌ తదితర రంగాలకు వేర్‌హౌసింగ్‌, రవాణా, ప్లాంట్లలో రవాణా తదితర విభిన్న సర్వీసులను అందిస్తోంది. 

ఇటీవల పలు లాజిస్టిక్స్‌ కంపెనీలు ఐపీవో బాట పడుతున్నాయి. ఇప్పటికే సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన ఇతర లాజిస్టిక్స్‌ కంపెనీలలో కాంటినెంటల్‌ వేర్‌హౌసింగ్‌, సీవేస్‌ షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ తదితరాలున్నాయి.
 Most Popular