ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే.. క్రెడిట్ స్కోర్‌కి ఉపయోగమా?

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే.. క్రెడిట్ స్కోర్‌కి ఉపయోగమా?


డిజిటలైజేషన్‌కి అడుగులు పడుతున్న సమయానికే కోట్ల మంది దగ్గర క్రెడిట్ కార్డులు ఉన్నాయి. మిలినియల్స్‌లో ఇప్పుడు అనేక మంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండడం ట్రెండ్ అయిపోయింది కూడా. ప్రతీ కంపెనీ పలు రకాల రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తూ, అదనంగా కార్డులను ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతోంది.

ఒకరి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులుండాలి?
ఒక వ్యక్తి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటే సరైనదిగా భావించాలి? ఈ ప్రశ్న తరచుగా ఎదురవుతూ ఉంటుంది. ఎన్ని వీలయితే అని కొందరు సమాధానం ఇస్తే, మరికొందరు మాత్రం ఒక్కదానికే మొగ్గుతారు లేదా అసలు వద్దని అనేస్తారు. పైగా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండడం క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా కొందరు నమ్ముతారు. మరి ఈ నమ్మకం నిజమేనా? ఈ కింది పాయింట్స్ ద్వారా బహుళ క్రెడిట్ కార్డులు ఉండడం మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం అర్ధం అవుతుంది.

ఎక్కువ ఖాతాలు నిర్వహించడం:
మీ దగ్గర ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే, ఆయా కార్డుల పేమెంట్ సైకిల్ ఆధారంగా వాటికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని కార్డులను తరచుగా ఉపయోగిస్తూ వాటి బిల్లుల చెల్లింపులను మిస్ చేసినట్లయితే, అది మీ క్రెడిట్ స్కోరుపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఇప్పటికే ఉన్న క్రెడిట్ ఖాతాలను నిర్వహించలేకపోవడంతో, ఇతర బ్యాంకులను మీకు అదనపు క్రెడిట్ కార్డు, రుణం ఇవ్వకుండా అడ్డు పడుతుంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు మీ ఖర్చుల విధానాన్ని వరుస పద్ధతిలోకి తీసుకురావాలి. ముఖ్యంగా రీపేమెంట్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. డ్యూ డేట్‌కు ముందు 0% శాతంగా వడ్డీ రేటు, ఆ తర్వాత మీకు ఏకంగా 30% వరకూ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్‌లో 35 శాతం దీని చూట్టూనే తిరుగుతుంది కాబట్టి, మంచి పేమెంట్ హిస్టరీ కలిగి ఉండడం అత్యంత ముఖ్యమైన విషయం.

 

రుణ పరపతి పరిధి దాటడం:

ఒకటి/అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు, ఇతర రుణ సాధనాల ద్వారా ఎక్కువగా రుణాలను పొందడం, మిమ్ములను అప్పుల ఊబిలో కూరుకుపోయేట్లుగా చేయవచ్చు. ఇది మీ క్రెడిట్ రిపోర్టుపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఎక్కువగా రుణాలను పొందిన కస్టమర్లను బ్యాంకులు వీలైనంత వరకూ పక్కన పెట్టేస్తాయి. రుణం, క్రెడిట్‌కు సంబంధించిన దరఖాస్తులను తిరస్కరించేందుకే ప్రాధాన్యం ఇస్తాయి.

 

తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేయడం:
తక్కువ సమయంలోనే వీలైనన్ని ఎక్కువ క్రెడిట్ కార్డులకు మీరు దరఖాస్తు చేయడం, మీరు ఎంతగా వాటి కోసం తపిస్తున్నారనే అంశాన్ని చూపుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోరు తగ్గేలా చేస్తుంది. ఇలాంటి కస్టమర్లకు రుణం ఇవ్వడాన్ని బ్యాంకులు రిస్క్‌గా భావిస్తాయి. ఒకవేళ మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసి ఉంటే, ఖర్చులను నియంత్రించి, క్రమం తప్పుకుండా చెల్లింపులు చేయడం ద్వారా, మంచి చెల్లింపు నడవడిక గల కార్డ్ యూజర్‌గా నిరూపించుకోండి. కొన్ని నెలల సమయంలోనే మీ క్రెడిట్ స్కోర్ పెరగడం ప్రారంభిస్తుంది. 

 

క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయడం:

బహుళ క్రెడిట్ కార్డులను కలిగి ఉండడం అనేది సమస్య అయినపుడు, వాటిలో కొన్నిటిని క్లోజ్ చేయడం ఏ సమయంలోనూ పరిష్కారం కాదు. క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడం ద్వారా మీ క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. తద్వారా మీ మిగిలిన క్రెడిట్ వినియోగం పెరిగిపోతుంది. మీకు అందుబాటులో ఉన్న రుణలభ్యతలో మీరు వినియోగించిన శాతం పెరగడం అంటే, అది క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపే విషయం. అందుకే ఎక్కువ క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నా, వాటిని ఎక్కువగా వినియోగించకుండా ఉండాలి.

 

యాక్టివ్‌గా లేని క్రెడిట్ కార్డులు:

మీ దగ్గర వినియోగించకుండా ఉన్న క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉన్నట్లయితే, చిన్న మొత్తం కోసం ఉపయోగించి, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేయడం ఉత్తమం. మీ క్రెడిట్ రిపోర్టులో ఉపయోగంలో లేని ఖాతాలను ప్రత్యేకంగా చూపుతారు. ఒక వేళ మీరు ఆ కార్డును సరిగా వినియోగించలేకపోతే, వార్షిక ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, దాన్ని క్లోజ్ చేయడమే ఉత్తమమైన పని.

 

సమతూకం లేని రుణాలు:

హోమ్‌లోన్స్ వంటి సెక్యూర్డ్ రుణాలు, క్రెడిట్ కార్డుల వంటి అన్‌సెక్యూర్డ్ రుణాల మధ్య సమతూకం పాటించడం సరైన విషయం. ఒక వేళ మీకు క్రెడిట్ కార్డులు మినహా, మరే ఇతర రుణాలు లేకపోతే, మీ క్రెడిట్ హిస్టరీని బ్యాలెన్స్ చేయడం సాధ్యం కాదు. ఇది కూడా మీ క్రెడిట్ కార్డుపై ప్రభావం చూపే అంశమే.

 

ఒక వినియోగదారుడికి రుణాన్ని జారీ చేసేందుకు, వారి నిలకడతత్వాన్ని బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి. మంచి క్రెడిట్ హిస్టరీని మెయింటెయిన్ చేసేందుకు సకాలంలో బిల్లులు చెల్లించడమే సులభమైన, కచ్చితమైన పద్ధతి. మీరు మంచి క్రెడిట్ హిస్టరీ కలిగి ఉన్నారని భావించి కూడా, లోన్-క్రెడిట్ పొందేందుకు సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చినట్లయితే, మీ క్రెడిట్ రిపోర్టును ఒకసారి పరిశీలించుకోండి. క్రెడిట్ రిపోర్టులో ఉన్న తప్పిదాలను సరి చూసుకుని, వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి.Most Popular