కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఇష్యూకి ఇన్వెస్టర్లు ఫిదా

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఇష్యూకి ఇన్వెస్టర్లు ఫిదా

ప్రభుత్వ రంగ షిప్‌బిల్డింగ్‌ సంస్థ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ పబ్లిక్‌ ఇష్యూకి దరఖాస్తు చేసేందుకు ఇన్వెస్టర్లు క్యూకట్టారు. గురువారం(3న) ముగిసిన ఇష్యూకి 76 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం దాదాపు 3.4 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా... 258 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 424-432కాగా..  తద్వారా రూ. 1468 కోట్లను సమీకరించింది. ప్రభుత్వం 25 శాతం వాటాను విక్రయానికి ఉంచింది. దీంతో లిస్టింగ్‌ తరువాత ప్రభుత్వ వాటా ప్రస్తుతం 100 శాతం నుంచి 75 శాతానికి తగ్గనుంది.  
బిడ్స్‌ వివరాలివీ
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) విభాగం నుంచి 63.5 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా.. సంపన్న వర్గాల(హెచ్‌ఎన్‌ఐలు) నుంచి దాదాపు 289 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 8 రెట్లకుపైగా బిడ్స్‌ వేశారు. ప్రభుత్వ రంగానికి చెందిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ రక్షణ, ప్రయివేట్‌ రంగాలకు అవసరమయ్యే షిప్‌ బిల్డింగ్‌, రిపేర్లతోపాటు మెరైన్‌ ఇంజినీరింగ్‌, శిక్షణల్లోనూ సేవలందిస్తోంది. భారత నావికాదళం, తీరప్రాంత గస్తీదళాలు కంపెనీ ప్రధాన కస్టమర్లుకావడం విశేషం.

2017 మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ నికర లాభం 7 శాతం పెరిగి రూ. 312 కోట్లను అధిగమించింది. నికర అమ్మకాలు సైతం 3.5 శాతం పుంజుకుని రూ. 2,209 కోట్లను తాకాయి. 2017 మార్చికల్లా రూ. 3,200 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. కంపెనీకున్న షిప్‌ రిపేర్‌ డాక్‌యార్డ్‌ దేశంలోనే అతిపెద్దదికాగా.. 1,25,000 డీడబ్ల్యూటీ సామర్థ్యంగల నౌకలకూ దీనిద్వారా సేవలందించగలదు. ఇప్పటికే రూ. 2,800 కోట్లతో విస్తరణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. కంపెనీ ఐపీవో పూర్తయితే ప్రభుత్వ రంగంలోని ఐదు షిప్‌యార్డ్‌లలో తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన సంస్థగా కొచ్చిన్‌ నిలవనుంది.Most Popular