స్టాక్ మార్కెట్లో కరెక్షన్ వస్తే ఏం చేయాలి?

2021-10-27 08:08:48 By Admin

img

స్టాక్ మార్కెట్ కరెక్షన్‌లో పడింది. గత వారంలో నాలుగైదు రోజుల పాటు సూచీలు పడిపోతే.... దానికి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీకి చెందిన షేర్లు చిగురుటాకు మాదిరిగా వణికిపోయాయి. దాదాపు 15- 20 శాతం మేరకు కొన్ని కంపెనీల షేర్ ధరలు తగ్గిపోయాయి. ఈ కరెక్షన్ ఇంకా కొనసాగుతుందా.. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? అనేది అందరు ఇన్వెస్టర్ల మదిలో మెదులుతున్న సందేశం. దీనికి పీవైటీ ప్రాఫిట్ యువర్ ట్రేడ్) ఆదివారం నాడు ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబినార్ కొంతవరకూ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. “మార్కెట్ కరెక్షన్లో అనుసరించాల్సి వ్యూహాలు” అనే అంశంపై నిర్వహించిన ఈ వెబినార్లో స్టాక్ మార్కెట్ వ్యవహారాల నిపుణులు సి. కుటుంబరావు, టీవీన్ బిజినెస్ ఎడిటర్ పి.వి.వసంత్ కుమార్ ఈ వెబినార్లో పాల్గొని అనేక అంశాలను విడమరచి చెప్పారు. అంతేగాక పలువురు ఇన్వెస్టర్లు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ వెబినార్లో ప్రస్తావనకు వచ్చిన ముఖ్యమైన అంశాలు.. పీవైటీ పాఠకుల కోసం ప్రత్యేకం.

 

గొప్ప ఇన్వెస్టర్ల మాట...

“మార్కెట్ కరెక్షన్లలో ఇన్వెస్టర్లు పొగొట్టుకునే సొమ్ము కంటే మార్కెట్లో కరెక్షన్ రాబోతోందని అనుమానిస్తూ... మంచి అవకాశాలను చేజార్చుకొని పొగొట్టుకునే సొమ్మే అధికం.”

- పీటర్ లించ్.

 

“10 శాతం కరెక్షన్ సర్వసాధారణం. ఏడాది కాలంలో ఏదో ఒక సమయంలో అది రావచ్చు. దాని కోసం కంగారుపడిపోయి పెట్టుబడులను గందరగోళం చేయటం కంటే నమ్మకంతో తమ పెట్టుబడులను కొనసాగించటమే సంపద సృష్టికి మూలం..."

- క్రిస్టఫర్ డేవిస్

 

“నిరాశాపరుల నుంచి షేర్లు కొని ఆశావహులకు షేర్లు విక్రయించే వాడే తెలివైన ఇన్వెస్టర్ “మార్కెట్ పతనావస్థలో కుంగిపోకుండా..... బాగా పెరిగినప్పుడు సంబరపడకుండా ధైర్యంగా ఉండాలి.

- బెంజమిన్ గ్రాహమ్.

 

"విశ్వసించిన పెట్టుబడి విధానాలను కొనసాగించిన ఇన్వెస్టర్లనే విజయం వరిస్తుంది” “ఓపిక లేని వారి నుంచి ఓపికగా ఎదురుచూసే వారికి సంపదను బదిలీ చేసేదే స్టాక్ మార్కెట్"

-వారెన్ బఫెట్.

 

“చరిత్రను ఒకసారి పరికించి చూస్తే స్టాక్మర్కెట్ సంక్షోబాల గురించి స్పష్టంగా తెలుస్తుంది. మార్కెట్లో సంక్షోభాలు (కరెక్షన్) అనివార్యం. ఎంతో బాధకలిగించేవి కూడా. కానీ వాటిని అధిగమించవచ్చు."

- షెల్బీ ఎం.సి.డేవిస్.

 

కరెక్షన్ ఎన్నాళ్లు?

సాధారణంగా స్టాక్ మార్కెట్ కరెక్షన్లు ఎక్కువ కాలం ఉండవు. కొన్ని వారాల పాటుమాత్రమే కరెక్షన్ ఉంటుంది. ఉదాహరణకు గత ఏడాదిలో కరోనా మహమ్మారి విస్తరించటం మొదలు కాగానే ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అది మూడు నెలల ఉంది. ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి. గత ఏడాది సెప్టెంబరులో కరెక్షన్ కేవలం మూడు వారాలు మాత్రమే కొనసాగింది. కరెక్షన్కు కారణమైన ఏదైనా పెద్ద రాజకీయ పరిణామం, ఆర్థిక సంక్షోభం, ఇతర సంఘటనల ప్రభావం తగ్గుముఖం పట్టగానే స్టాక్‌మార్కెట్లు మళ్లీ వృద్ధి బాట పడతాయని గుర్తుంచుకోవాలి.

 

కరెక్షన్ వర్సెస్ బేర్ మార్కెట్

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు కరెక్షన్ స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. సూచీలు 15-20 శాతం మాత్రమే పతనం అవుతాయి. కానీ బేర్ మార్కెట్ దీర్ఘకాలం ఉంటుంది. రెండు మూడేళ్ల పాటు ఉండవచ్చు. అంతేగాక షేర్లు భారీగా, ఊహించలేనంత అధికంగా పడిపోతాయి. స్మాల్ అండ్ మిడ్క్యాప్ షేర్లు 80- 30 శాతం వరకూ పడిపోవచ్చు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, యుద్ధాలు, కరోనా వంటి మహమ్మారి విస్తరించటం.... తదితర అనూహ్యమైన పరిస్థితులు బేర్ మార్కెట్ రావటానికి వీలు కల్పిస్తాయి.

 

కరెక్షన్, కింకర్తవ్యం...

మీ పెట్టుబడుల్లో వైవిధ్యం ఉంటే, ఒక క్రమశిక్షణతో మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే... కరెక్షన్ మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టడు. మీ పోర్ట్‌ఫోలియో విలువ కొంత తగ్గుతుంది. అంతకు మించి మీకు నష్టం ఉండదు. ఆ కరెక్షన్ను ఓపిగ్గా తట్టుకుంటే, తదుపరి మళ్లీ మార్కెట్ కోలుకొని మీ పెట్టుబడుల విలువ పెరుగుతుంది. కాకపోతే ఆ సమయంలో “ఎమోషన్స్”ను మీ హేతుబద్ధతపై ప్రభావం చూపి, తొందరపాటు, అపనమ్మకంతో మీరు తప్పులు చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. కరెక్షన్కు ఒక మంచి పెట్టుబడి అవకాశంగా కూడా వాడుకోవాలి. మీకు నమ్మకం ఉన్న కంపెనీల షేర్ల ధరలు బాగా పడిపోతే మళ్లీ కొంత పెట్టుబడి పెట్టాలి. ఆ విధంగా సంక్షోభాన్ని, చక్కని అవకాశంగా మలుచుకోవాలి.

 

రిస్కును తట్టుకునే పోర్ట్‌ఫోలియో

స్టాక్ మార్కెట్లో ఒకేసారి పెట్టుబడి పెట్టి, ఒకేసారి అమ్ముకొని బయటకు వచ్చేయాలనుకునే ధోరణి సరికాదు. క్రమం తప్పకుండా కొన్నేళ్ల పాటు సమయానుకూలంగా పెట్టుబడులు పెడుతూ మంచి పోర్ట్ఫోలియా నిర్మించుకోవాలి. ఎలాగంటే పెనుతుఫాను, గాలివాన మాదిరి సంక్షోబాలు స్టాకమార్కెట్లో వచ్చినప్పటికీ తట్టుకునే మాదిరిగా. అలా చేయగలిగితే మీరు పెట్టిన పెట్టుబడికి నష్టం అనేది ఉండదు. కాకపోతే లాభాలు తగ్గటం, పెరగటం ఉంటుంది. ఒకసారి మీరు ఈ “టేక్-ఈవెన్” “స్టేజీని అధిగమించగలిగితే ఆ తర్వాత ఏ కరెక్షన్ వచ్చినా మీకేం కాదు. పైగా అటువంటి సమయాల్లో మీరు పెట్టే అదనపు పెట్టుబడులు ఆ తర్వాత ఇంకా పెరిగి మీ సంపద రెట్టింపు అవుతూ ఉంటుంది.

 

కొంత సొమ్ము చేతులో ఉంచుకోవాలి...

కరెక్షన్ వచ్చినప్పుడు మంచి పెట్టుబడి అవకాశాలు వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవటానికి వీలుగా ఇన్వెస్టర్లు కొంత సొమ్మును తప్పనిసరిగా చేతులో ఉంచుకోవాలి. అవకాశాలను బట్టి దాన్ని వినియోగించాలి. 

 

పెట్టుబడులపై సమీక్ష

ఏడాది, రెండేళ్లకోసారి... లేదా సమయానుకూలంగా తమ పెట్టుబడులను ఇన్వెస్టర్లు పరిశీలించాలి. ఏ కంపెనీ షేర్కు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏ కంపెనీ షేర్లను విక్రయించాలి. లేదా ఇంకా పెట్టుబడి పెట్టాలి, రిస్కు- రివార్డు నిష్పత్తి ఎలా ఉంది...? మనం ఎంత వరకూ రిస్కు తీసుకోగలం... అనే అంశాలను పరిశీస్తూ, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. పోర్ట్‌ఫోలియోను ఆ మేరకు మార్చుకుంటూ ఉండాలి.

 

కొన్ని సూచనలు...

* ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, బీఓబి, పిఎన్‌బీ షేర్లలో అనూహ్యమైన కదలిక వచ్చింది. దీన్ని బట్టి స్టాకమార్కెట్లో “సెక్టోరియల్ రొటేషన్” అవుతుందని అర్ధం చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగం కోలుకొని వృద్ధి బాటపడుతోంది. అందుకే ఈ బ్యాంకుల షేర్లు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది వ్యవధిలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయి..

 

* స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు ఎంత అధిక ప్రతిఫలాన్ని ఇస్తాయో, రిస్కు కూడా అంతే ఉంటుంది. మార్కెట్ కరెక్షన్లలో ఈ షేర్లు బాగా పడిపోతాయి. అందుకే ఈ విభాగాల్లో మంచి కంపెనీలను ఎంచుకొని పెట్టుబడి పెట్టి, దాన్ని ఎప్పటికప్పుడు మోనిటర్ చేసుకుంటూ ఉండాలి. వాల్యుయేషన్లు బాగా పెరిగాయనే అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఆ షేర్లు విక్రయించి సొమ్ము చేసుకోవాలి. లేకుండా ఆ షేర్లు ఎక్కడ మొదలయ్యాయో... మళ్లీ అక్కడకు వచ్చే ప్రమాదం ఉంటుంది.

* గత వారం రోజుల్లో బిఎస్ఈ 500 సూచీ 2 శాతం పడిపోయింది. బిఎస్ఈ మిడ్ క్యాప్ 4 శాతం, స్మాల్ క్యాప్ 5 శాతం పతనం అయ్యాయి. కానీ డీసీఎం శ్రీరాం, బాలాజీ అమైన్స్, బలరాంపూర్ చీనీ మిల్స్, ఎన్ఎల్‌సీ ఇండియా, లారస్ ల్యాబ్స్, పీఎన్ హౌసింగ్ ఫైనాన్స్, జుబిలాంట్ ఫుడ్ వర్క్స్.. వంటి షేర్లు 15 నుంచి 20 శాతం పడిపోయాయి. అంటే బాగా పెరిగిన షేర్లు ఎక్కువగా పతనం అయ్యాయన్నమాట. ఈ విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అధిక వాల్యుయేషన్లు ఉన్నప్పుడు ఆ షేర్లలో పెట్టుబడులు పెట్టటం రెస్కు అనేది గుర్తించాలి. ఐఆర్‌సీటిసిలో ఎంతో మంది ఎలా ఇరుక్కుపోయారనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

ప్రస్తుత కరెక్షన్ కొంతకాలం పాటు కొనసాగవచ్చు. సూచీలు, షేర్ల ధరలు బాగా పెరిగి ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతానికి రేంజ్ బౌండ్ లోనే సూచీలు ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ తొలిసారిగా గత వారంలో 40,000 మార్క్‌ను అధిగమించింది. బ్యాంకులు రెండో త్రైమాసికానికి మంచి ఫలితాలు ప్రకటించటం దీనికి కొంతవరకూ కారణం. ఇదే సానుకూలత బ్యాంకులకు కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా గృహోపకరణాల పరిశ్రమ, ఇండస్ట్రియల్స్, కెమికల్స్ రంగాలకు చెందిన కంపెనీలు భవిష్యత్తులో మంచి పనితీరు కనబరచవచ్చు. ఈ రంగాల్లో ఇంకా ఆకర్షణీయమైన ధరల్లో పలు కంపెనీల షేర్లు కనిపిస్తున్నాయి. వాటిని ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకొని పెట్టుబడులు పెడితే మంచి ప్రతిఫలం ఉంటుంది.


WEBINAR

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending