నిట్టనిలువునా కూలిన మార్కెట్లు : నిఫ్టీ 300, సెన్సెక్స్ 1150 పాయింట్లు డౌన్ : మార్కెట్ల జోలికి వెళ్లొద్దు...! అమ్మగలిగే ధైర్యం ఉన్నవాళ్లే ట్రేడింగ్‌‍కి దిగండి, నష్టాలకు కారణమిదే

2022-05-19 09:50:27 By Anveshi

img

మార్కెట్లకు అమెరికా దెబ్బ పెద్ద  అశనిపాతంగా మారింది. అక్కడి ఆర్థిక స్థితిపై లెక్కలు మన మార్కెట్లకు పిడుగుపాటుగా మారడంతో ఓపెనింగ్‌లోనే నిఫ్టీ 300 పాయింట్లకిపైగా పతనం అయింది. నిఫ్టీ 16240 పాయింట్ల నుంచి ఒకేసారి నిట్టనిలువుగా 15929 పాయింట్లకి పడిపోయింది. ఆ తర్వాత ఇంకా జారి 15904 పాయింట్ల కనిష్టానికి జారింది

 

సెన్సెక్స్‌లోనూ ఇదే తరహా నష్టం ఆవృతమైంది. 1100 పాయింట్లు మొదటి ఐదు నిమిషాల్లోనే నష్టపోయి ప్రస్తుతం సెన్సెక్స్ 53267 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ( ఈ అంకెలన్నీ కూడా కథనం ప్రచురించే సమయానికి ఉన్నవని గమనించండి)

 

బ్యాంక్ నిఫ్టీ ఒకటిన్నరశాతం వరకూ పతనం కాగా, ఐటి రంగం 4 శాతం పతనం అయింది

 

స్మాల్ మిడ్ క్యాప్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్ఈ స్టాక్స్ 2 శాతానికిపైగా పతనం కాగా, మెటల్ షేర్లు మరోసారి మహా ఊచకోతకి గురయ్యాయ్

 

టాప్ గెయినర్లలో ఆశ్చర్యకరంగా ఐటిసి 4శాతం లాభపడగా, ఐషర్ మోటర్స్ స్వల్పలాభంతో ఉంది

 

లూజర్ల లిస్టుకి అంతే లేదు. హిందాల్కో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో మూడున్నర నుంచి నాలుగున్నర శాతం  వరకూ నష్టపోగా, ట్రేడర్లు తమ నష్టాలను లెక్కపెట్టుకునే పనిలో పడ్డారు

 

ఇలాంటి మార్కెట్లలో కూడా ట్రేడింగ్ చేయాలంటే, జస్ట్ హోల్డింగ్స్ నుంచి అమ్మకాలకు దిగడమే శరణ్యం. హోల్డింగ్స్ కి మరో 50శాతం అదనంగా జోడించి అమ్మాలి. అదనంగా అమ్మినవాటిని మాత్రమే సాయంత్రానికి కవర్ చేసే ధైర్యం ఉన్నప్పుడే ఈ పని చేయాలి అప్పుడే ఇక బయ్ ఆన్ డిప్స్ వదిలేసి..సెల్లాన్ ర్యాలీస్ సూత్రంలోనూ లాభాలు దక్కుతాయ్. మరి ఆ పని చేస్తే మాత్రం లాభం గ్యారంటీనా అంటే అది కూడా దైవాధీనం లారీ సర్వీస్ లాంటిదే.

 

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలాంటి గ్లోబల్ పాపులర్ ఎకానమీ తీవ్రంగా నష్టపోతుందన్న ప్రచారం మన మార్కెట్ల నష్టాలకు ప్రాథమిక కారణం


సో..ఏతా వాతా మార్కెట్‌లో తలపండినవారు, పండితులంతా చెప్తోన్నదొకటే మాట..మార్కెట్లకు దూరం జరగండి..జస్ట్ అబ్జర్వ్ చేయండి అని..!