డాక్టర్ రెడ్డీస్ ఫలితాలు పేలవం..! 76శాతం క్షీణించిన లాభం, ఇంపెయిర్‌మెంట్ రూపంలో చిల్లు

2022-05-19 16:45:05 By Anveshi

img

తెలుగువారి ఫార్మాసూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ 2022 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో పూర్తిగా నిరాశపరిచే ఆర్ధిక ఫలితాలను వెల్లడించింది. నికరలాభం ఏకంగా 75.85శాతం తగ్గినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.362.4 కోట్లతో పోల్చితే బాగా తగ్గిపోయి రూ.87.50కోట్లకి పరిమితమైంది

 

అనలిస్టులు, బ్రోకరేజీ సంస్థలు వేసిన అంచనాలను ఇది పూర్తిగా తలకిందులు చేయడమే కాకుండా చాలామందిలో కలవరం పుట్టించేదే..! 

 

ఐతే ఆదాయం మాత్రం దాదాపు 15శాతం వృద్ధి చెంది రూ.5436.80కోట్లకి చేరడం గమనార్హం. 

 

కంపెనీకి చెందిన రెండు యాంటీ బాక్టీరియల్ బ్రాండ్లను విక్రయించడం ద్వారా రూ.177కోట్ల ఆదాయం వచ్చినట్లుఅలానే మరో రెండు బ్రాండ్లను మ్యాన్ కైండ్ ఫార్మాకి విక్రయించడం ద్వారా రూ.39 కోట్లు ఆర్జించినట్లు తెలిసింది 

 

గడచిన మూడు నెలల్లో మార్కెట్ కండిషన్లకు తగినట్లుగా ఉత్పత్తులను మార్చినట్లు కంపెనీ ప్రకటించింది. పొటెన్షియల్ ఉన్న ప్రొడక్ట్స్ తగ్గిపోవడం, పోటీ పెరగడంతో అమ్మకాలు తగ్గిపోవడమే ఈ ఫలితాలకు కారణమని కూడా చెప్పుకొచ్చింది. అందుకే తమ  ఆర్థిక ఫలితాల అంకెలు తమ అంచనాలకే తగినట్లుగా లేవని వాపోయింది

 

కంపెనీ  ఇంపెయిర్‌మెంట్ కోసం రూ.756.20 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పడం గమనార్హం. ఈ ఖర్చుతోనే లాభాలు కోసుకుపోయినట్లనుకోవాలి

 

" ఆదాయంలో మంచి వృద్ధి గడించాం. అనేకరకాల సవాళ్లు ఉన్నా, ముఖ్యమైన వ్యాపారం మాత్రం చక్కగా ఉంది. మార్కెట్ వాటా పెంచుకున్నాం. అలానే లాభాలు దెబ్బతిన్నా కూడా  కొన్ని పటిష్టమైన ఉత్పత్తులను కూడా ప్రారంభించాం" అంటూ సంస్థ కో ఛైర్మన్, ఎండి జివి ప్రసాద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు

 

ట్రేడింగ్ సాగుతుండగానే  ఈ ఫలితాలు వెల్లడి కాగా,  డా.రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు దాదాపు ఒకశాతం లాభంతో  రూ.3942.25 వద్ద ముగిశాయ్