థర్డ్ వేవ్ తప్పదు..! అది కూడా 2 నెలలోపే..! వణికించే హెచ్చరిక చేసిన ఎయిమ్స్ ఛీఫ్! మరి మనమేం చేస్తున్నాం!?

2021-06-19 20:52:29 By Anveshi

img

తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత
నైట్ కర్ఫ్యూ కూడా లేకుండా ఎకాఎకిన మొత్తంగా రద్దు
సంభ్రమాశ్యర్యాల్లో నిపుణులు
ఇదే సమయంలో వెన్నులో వణుకు పుట్టించే హెచ్చరిక చేసిన రణదీప్ గులేరియా
6-8వారాల్లోనే థర్డ్ వేవ్ వస్తుందని..ఆపలేరంటూ వార్నింగ్

 

కరోనా కేసులు పెరిగితే..లాక్‌డౌన్ పెట్టడం, కాస్త తగ్గినట్లు కన్పిస్తే ఎత్తేయడం..ఇదేనా మన దేశంలో జరిగే తంతు ? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమే కదా అన్పించకమానదు. ఢిల్లీలో 500 కేసులు రోజుకు పడిపోవడంతో..ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ తీసేసి, అన్‌లాక్ చేస్తున్నారు. కానీ అక్కడ దశలవారీగా, మహారాష్ట్రలో కూడా అంతే, మహా  ప్రళయమే చోటు చేసుకున్న  అక్కడ ఇప్పుడు కాస్త పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. కర్నాటక, కేరళ, పరిస్థితి కూడా అంతే దేశవ్యాప్తంగానే కేసులు  60వేలకి దిగిరావడంతో కేంద్రం కూడా ఈ సడలింపులపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. కానీ ఎప్పుడైతే తిరిగి  జనం గుంపులుగా తిరగడం ప్రారంభమైందో..సిచ్యుయేషన్ తిరిగి సీరియస్‌గా మారడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చనే  ఆందోళన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఎయిమ్స్ -ఢిల్లీ చీఫ్ రణదీప్ గులేరియా ఓ వార్నింగ్ బెల్ మోగించారు

 

6-8 వారాలలోపే భారత్‌లో థర్డ్ వేవ్ రాబోతోంది. వైరస్ ఇంకా మ్యూటేట్ అవుతోంది. కాబట్టి దీన్ని తప్పించలేమంటూ తీవ్రంగా హెచ్చరించారు. దీనికి కారణం, జనం ప్రవర్తనే, వారికి అలసత్వం ఇచ్చేలా ఆంక్షలు సడలించిన ప్రభుత్వాలది కూడా తప్పే,దీనికి తోడు ఈ మధ్యనే డెల్టా ప్లస్ వేరియంట్ గురించిన కలవరం ఒకటి గత వారమే మొదలైంది. ఇప్పుడు ఇండియాలో ఇది లేదు అంటున్నారు..కానీ లేదు అన్న నోళ్లే..ఖచ్చితంగా పది రోజులలోపు దాని విజృంభణతో మాట మార్చడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ఇదే తరహా వాదనలు ఫస్ట్ వేవ్,  సెకండ్ వేవ్ సందర్భంగా చేసి ఆ తర్వాత  ఎవరికి వారే ఇతరులపై ఆ పాపాన్ని నెట్టేశారు

 

ఇప్పుడు రణదీప్ గులేరియా  చెప్తున్నదానిప్రకారం,  2 నెలలోపే వైరస్ మూడో దశ ప్రారంభమవుతుంది. దీనిని  నివారించాలంటే, మైక్రో కంటైన్మెంట్ పాటించాలి. మినీ లాక్‌డౌన్‌లు కంటిన్యూ చేయాలి. అలానే ట్రాక్, ట్రేస్, టెస్ట్, వ్యాక్సినేషన్  సాగాలి. కానీ ఈ నాలుగింటిలో మొదటి మూడు ఎప్పుడో గాలికి వదిలేశారు. గతంలోలాగా ఎవరికైనా వైరస్ సోకితే, అతని  కాంటాక్స్ట్స్ ట్రేసింగ్ అనేది ఒకటి చేయాలనే విషయమే మర్చిపోయాయ్ ప్రభుత్వాలు. అంతెందుకు, సాక్షాత్తూ పేషెంట్లే తమ వివరాలు చెప్తున్నా..ఫాలో అప్ ఉండటం లేదని బోలెడుమంది వాపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు..వ్యాక్సినేషన్ ఒక ఎత్తు. దేశంలో కనీసం సగం జనాభాకి కూడా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. ఇలాంటి తరుణంలో పబ్పులు గబ్బులు బార్లు బార్లా తెరవకపోతే జనమేమైనా చచ్చిపోతారా..కేవలం ఆదాయంపై దృష్టి తప్ప వేరొకటి కాదని అర్ధమవుతూనే ఉంది. అత్యవసరాలు, నిత్యావసరాలు, వ్యాపారాలు అంటే అర్ధముంది వినోద సాధనాలకు ఏమంత తొందర. అసలంటూ ముందు జనాలు బతికితేనే కదా వినోదం వైపు మళ్లేది. అఫ్‌కోర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై పడి ఆధారపడేవాళ్లు వేలలోనే ఉంటారు కాదనరు, కానీ వారికి ఆల్టర్నేటివ్ సాయం ప్రభుత్వాలు అనుకుంటే చేయవచ్చు, కానీ ఇలా ఎకాఎకిన మొత్తం తెరిచేయడం ఆ తర్వాత మొత్తంగా మూసేయడం చూస్తుంటే, అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత గుర్తుకురాకమానదు. 

 

పైగా ఈసారి థర్డ్ వేవ్‌లో చిన్నారులపైనే ఎక్కువ ప్రమాదం పడుతుందన్న సమాచారం తెలిసి కూడా స్కూళ్లు ఓపెన్  చేస్తామంటూ ఆర్బాటం చేయడం వింత విషయం. గత ఏడాది అందరూ స్కూళ్లు తెరిచి మంచి జాగ్రత్తలతో  నిర్వహించుకున్నప్పుడేమో, మనోళ్లు ఫిబ్రవరి వరకూ తెరవలేకపోయారు. అంతా చేసి తెరిచీ తెరిచిన పదిహేనురోజులకే  మూతవేశారు. ఇప్పుడేమో ఎవరూ ఆ ఊసే ఎత్తకపోయినా, పాఠశాలలు తెరుస్తున్నాం, పేరెంట్స్ వాళ్లకి ఇష్టం ఉంటే పంపొచ్చు లేదంటే ఆన్‌లైన్‌కి పరిమితం కావచ్చు అంటే, ఈ విధానం మరింత అపహాస్యం పాలవుతుంది. దానికంటే కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి రాష్ట్రాల్లో సగం జనాభాకి టీకాలు ఇచ్చాం( ఒక్క డోసు అయినా) అని అనుకున్న తర్వాత  ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బావుంటుందనేది ఆలోచనాపరుల మాట

 

మరి మనమేం చేయాలి
ప్రభుత్వాలపైనే ఆధారపడకూడదన్నది సెకండ్ వేవ్ నేర్పించిన పాఠం. ఫస్ట్‌వేవ్ వైరస్ బారిన పడకుండా ఏం చేయాలన్నది  నేర్పింది, సెకండ్ వేవ్ అజాగ్రత్తగా వ్యవహరిస్తే నిర్లక్ష్యంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కుటుంబసభ్యులను వదులుకునేలా చేసింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కబళించడానికి సిద్ధంగా ఉన్న కరోనా వైరస్‌తో థర్డ్ వేవ్ రాకుండానే చేయగలగాలి. అది  సాధ్యపడాలంటే, మనకి మనమే ఓ స్వీయనియంత్రణ విధించుకోవాలి. టీకా, మాస్క్, సామాజిక దూరం ఈ మూడే మనిషికి  మిగిలిన మార్గాలు. 

 

 

( కథన చోరశిఖామణులకు, నరక్షరకుక్షులకు విన్నపము స్టోరీలను  యథాతథముగా కాపీ కొట్టవలదు అనగానే, ఎక్కడిక్కడ ఖండఖండాలకు ఎత్తి అపహాస్యము పాలవుతున్న తీరు కడు హాస్యస్ఫోరకము. దీనికంటే సొంత బుర్రలను వాడిన యజమానులకు మోదము)


RANADEEP GULARIA AIIMS DELHI MAHARASTRA LOCKDOWN UNLOCK THIRD WAVE TELANGANA LIFT SCHOOLS REOPEN