ఈ పెయింటింగ్ రేటు రూ.37కోట్లకిపై మాటే..! ఎందుకింత ఖరీదు..ఏముందంత స్పెషాలిటీ?

2021-07-21 21:23:16 By Anveshi

img

కళాకారులకు,మేధోసంపత్తికి ఖరీదు కట్టడం ఎవరి వల్లా కాదు.  బతుకుబండి లాగేందుకో, ఓ సేఫ్‌జోన్ కోసమనో, కొందరు తమ
కళకి ఇంత అని ఓ రేటు ఫిక్స్ చేస్తే దాంతో సంతృప్తి పడతారు. మరి కొందరు తమ కళకి విలువ కట్టడం కుదరదంటూ  ఉచితంగానే పంచుతుంటారు. ఏదెలా ఉన్నా..బంగారుపళ్లెమైనా సరే, ఏదోక ఆధారం లేకపోతే నిలబడలేదు కదా, అలా ఎంత  గొప్ప కళ,రచన,సాహిత్యం, ఎట్సెట్రా..ఎట్సెట్రా ఏదైనా సరే వాటికంటూ ఓ ధర పలికిన తర్వాతే వాటి గురించి బైటి ప్రపంచానికి  తెలుస్తుంది. 

గత వారం మన భారతదేశంలోని ఆక్షన్ హౌస్(వేలంపాట నిర్వహించే సంస్థ) శాఫ్రనాట్..సమ్మర్ సేల్ పేరిట ఓ లైవ్ ఆక్షన్ నిర్వహించింది. అందులో మీరిప్పుడు చూసిన పెయింటింగ్ ఖరీదు రూ.37.80కోట్లకి ధర పలికింది. ఇది మన దేశంలోని అత్యంత ఎక్కువ ధర పలికిన రెండో పెయింటింగ్ కావడమే మనం చెప్పుకోవడానికి వీలు కల్పించిన విశేషం. 

 

ఈ పెయింటింగ్ గీసినది, అమృతా షెర్‌గిల్..ఆమె ఇప్పుడు జీవించిలేరు. పైగా ఈ పెయింటింగ్ కూడా ఇప్పటిది కాదు. 1938నాటిది. పురాతన చిత్రాలకు గిరాకీ ఉండే మాట వాస్తవమే అయినా, అమృతా షెర్‌గిల్ గురించి ఇప్పుడు ఖచ్చితంగా  చెప్పుకోవాలి, ఎందుకంటే, " యూరప్ పికాసోతో పాటు మాటిస్సీ ..ఇంకా కొంతమందిదైతే అయింది..కానీ భారత్ మొత్తానికీ  నేనే..నాదే ..! "అని గర్వంగా, ఆ రోజుల్లోనే ఘంటాపథంగా చెప్పిన ఏకైక పెయింటర్ ఆమె( ఇక్కడ మళ్లీ విమెన్ పెయింటర్  అంటూ వివక్ష ఎందుకు). అందుకే ఆమె చనిపోయిన 80ఏళ్లకి కూడా ఆమె పెయింటింగ్‌కి ఇంత పాపులారిటీ

 

ఇప్పటికీ అమృతాషెర్‌గిల్ చిత్రకారులను ప్రభావితం చేస్తున్నారనడానికి ఈ పెయింటింగ్‌కి దక్కిన వేలం ధరే నిదర్శనమని ఈ సందర్భంగా శాఫ్రనాట్ ఓనర్, దినేష్ వాజిరానీ చెప్తారు

పెయింటింగ్ డీటైల్స్
ఈ చిత్రాన్ని ఆమె ఇన్ ది లేడీస్ ఎంక్లోజర్ పేరుతో రచించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని తమ పూర్వీకుల ఎస్టేట్‌లో  ఉండగా ఈ పెయింటింగ్ వేసిన ఆమె తల్లి మేరీ ఆంటోనెట్ హంగేరీ దేశస్థురాలు. తండ్రి ఉమ్రావ్ సింగ్ షెర్గిల్ అనే పంజాబీ సిక్కు  మతస్థుడు. బాంబా సుదర్లాండ్ యువరాణితో కలిసి మేరీ ఆంటోనెట్ భారత్‌కి రావడం జరగగా, ఈ యువరాణి మహారాజా  రంజిత్ సింగ్ మనవరాలు కావడం విశేషం. అలా ఈ ఇద్దరు తల్లిదండ్రులకు పుట్టిన అమృతాషెర్‌గిల్ వారికి పెద్ద కుమార్తె. ఆమె  ఎక్కువగా బుడాపెస్ట్ల్‌లోనే పెరగగా, భారత్‌కి వచ్చి వెళ్తుండగా ఆమె బంధువైన ఎర్విన్ బాక్టే , ఆమె పెయింటింగ్ టాలెంట్ చూసి  ప్రోత్సహించగా తమ పని మనుషులనే మోడల్స్‌గా తీసుకుని సహజత్వం ఉట్టిపడేలా బొమ్మలు గీసేది. అలా అలా 1921  వచ్చేనాటికి వారి కుటుంబం కూడా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవడంతో సిమ్లాకి షిఫ్ట్ అయింది. అలా చిత్రకళలో చేయి తిరిగిన  ఆమె, తర్వాతి తరాలకు కూడా గుర్తుండిపోయే ఎన్నో చిత్రాలు గీసారు. 

పాశ్చాత్య, సంప్రదాయ కళలను రంగరించి పెయింటింగ్స్ వేయడంతో ఆమెని భారతదేశపు ఫ్రీదా కాహ్లోగా కూడా పిలిచేవారు.  ఆమె వేసిన పెయింటింగ్స్ చూస్తే ఆ కాలంలోనే అలాంటి బోల్డ్ పెయింటింగ్ వేసినందుకు బ్రేవో.. అనక మానరు. కేవలం 28ఏళ్ల వయసులోనే చనిపోయిన ఈమె ఆత్మ భారతీయం కాగా, ఆహారవ్యవహారాలు పాశ్చాత్యంగా చెప్తుంటారు

కొసమెరుపు: నటుడు జిమ్మీ షెర్‌గిల్ ఈమెకి మనవడు వరస
బోలెడుమంది ఈమె జీవితం ఆధారంగా బయోపిక్ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు


amrita sher-gill frida kahlo india picaso painting highest rate auction