ఎడా పెడా పెంచుకుంటూ పోవడమే తప్ప ఏ వస్తువుల రేట్లూ తగ్గించడమనే మాటే విన్పించని, విన్పించుకోని కేంద్రం కొత్త ఆర్ధికసంవత్సరంలో భారీ షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అక్కౌంట్లపై మూలుగుతూ మూలుగుతూ నానా ఆపసోపాలు పడుతూ ఇస్తోన్న 4శాతం వడ్డీని కూడా ఒకేసారి అరశాతం కోసేసింది. ఈ వడ్డీపైనే ఆధారపడి ఎవరూ బతకకపోయినా, కనీసస్థాయిలో కూడా ప్రజల పొదుపరితనానికి ఏ మాత్రం విలువ లేదన్నట్లుగా వ్యవహరించడం దారుణం
ఏడాది పాటు ఉండే డిపాజిట్లపై 5.5శాతం నుంచి 4.4శాతానికి
2ఏళ్ల డిపాజిట్లపై5.5శాతం నుంచి 5శాతం
3ఏళ్ల డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 5.1శాతం
5ఏళ్ల డిపాజిట్లపై 6.7శాతం నుంచి 5.8శాతానికి
సీనియర్ సిటిజెన్ల డిపాజిట్లపై 7.4శాతం నుంచి 6.5శాతానికి తగ్గిస్తూ కేంద్ర ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
కాస్తో కూస్తో వడ్డీ గ్యారంటీ కోసమని బ్యాంకుల్లో డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజెన్లకు ఇది భారీ షాక్.
ఇదొక్కటే కాదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లలో వడ్డీ కూడా 7.1శాతం నుంచి 6.4శాతానికి తగ్గించారు.ఇదైతే మరీ దారుణంగా గత 46ఏళ్లలో లేని కనిష్టస్థాయికి చేరింది.
కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీని 6.9శాతం నుంచి 6.2శాతానికి తగ్గించారు.ఇక సుకన్య సమృద్ధి అక్కౌంట్ స్కీమ్ నుంచి వచ్చే వడ్డీని కూడా 7.6శాతం నుంచి 6.9శాతానికి తగ్గించారు.పైకి చెప్పే లక్ష్యాలు ఏవైనా సరే, ప్రజలకు ఋణాలు ఇచ్చేటప్పుడు భారీగా వడ్డీ వసూలు చేసే బ్యాంకులు వారి నుంచి తీసుకునే డిపాజిట్లపై మాత్రం ఇలా కోతలు విధించుకుంటూ పోవడం సేవింగ్స్ ఖాతాలంటేనే జనాలకు మొహం మొత్తే విధంగా వ్యవహరించడమే. వ్యవస్థలో డిమాండ్ పెంచాలంటే పొదుపు చేయకూడదు, ఖర్చు పెట్టాలి. పెట్టించాలనే ఆర్థిక సూత్రం ఇలా ప్రజల ఆదాయాలకు చిల్లు పెట్టేలా ఉండకూడదనేది కొందరి విమర్శ.. ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడం కోసం కాదన్నమాటని ఇలా సేవింగ్స్ ఖాతాలకు కూడా వర్తింపజేస్తున్నారా అన్నదే సామాన్యుల ప్రశ్న