-->

పద్దులతో ఆ స్టాక్స్ ఆకట్టుకుంటాయా?

2021-01-13 10:27:59

img

పద్దులతో ఆ స్టాక్స్ ఆకట్టుకుంటాయా
బీమా, మౌలిక రంగాలకే పెద్ద పీటా
నిర్మలా సంకేతం అదేనా
రెండుసార్లు రుచించలేదు.. మరి ఈ సారి..

ఫిబ్రవరి 1 వస్తుంది.. అందరి చూపై నిర్మలమ్మ చల్లని చూపుపై ఉంది. వరాలు కురిపిస్తారా లేక వడ్డనలుంటాయా అన్నది చూడాలి. సామాన్య జనాలకు ఎలా ఉన్నా.. స్టాక్ మార్కెట్ కు మాత్రం బిగ్ డే ఇది. బడ్జెట్ వస్తుందంటే మార్కెట్లో మదుపుదారులు కళ్లలో వత్తులు పెట్టుకుని చూస్తుంటారు. మార్కెట్లో రెండు బిగ్ డేస్ ఉంటాయి. ఒకటి మూరత్ ట్రేడింగ్ అయితే... రెండోది బడ్జెట్. అవును.. బడ్జెట్ రోజు మార్కెట్లు ప్లస్ ఆర్ మైనస్ 3 నుంచి 8 శాతం వరకూ ఉంటుంది. సానుకూలంగా ఉంటే.. గ్రీన్ గ్రాఫ్ పెరుగుతుంది. వ్యాపార వర్గాలకు రుచించకపోతే రెడ్ లైన్ కనిపిస్తుంది. మరి ఈ సారి ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో ఉంది.

మోదీ2.0లో....
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్లు కళకళలాడాయి. మొదటి ఐదు సంవత్సరాలు పారిశ్రామిక, వ్యాపార వర్గాలను మోప్పించారు. మార్కెట్లు బాగున్నాయి. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ 2.0 రెండు బడ్జెట్లు కూడా స్టాక్ మార్కెట్లను నిరుత్సాహపరిచాయి. మరి కోవిడ్ నేపథ్యంలో భారీ అంచనాలు పెట్టుకున్న ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికే రాయితీలు, సంస్కరణలు కోసం ఎదురుచూస్తున్నాయి.  వారికి అనుగుణంగా ప్రకటనలు వస్తే మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ ఈసారి స్టాక్ మార్కెట్లను మెప్పిస్తుంది.

బీమా, ఇన్ ఫ్రా సెక్టార్లు...
ముందుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లీకులు ఇచ్చారు. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఇన్ ఫ్రా రంగానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని పదేపదే చెబుతున్నారు. బడ్జెట్లో కూడా మౌలిక వసతులకు ప్రాధాన్య త ఇస్తామంటున్నారు మంత్రి నిర్మలా. ఉపాథి కల్పించడంతో పాటు.. మార్కెట్లో డిమాండ్ స్రుష్టించడమే లక్ష్యంగా పద్దులుంటాయని ఆర్థిక మంత్రి చెప్పారు. 
మౌలిక రంగంతో పాటు.. అటు బీమా రంగంపైనా ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. దేశీయంగా బీమా రంగానికి గల అవకాశాలను ప్రజలు మరింతగా వినియోగించుకునేలా చట్టాలను సరళతరం చేసే అవకాశం ఉంది. రూరల్ ప్రాంతాల్లో బీమా సదుపాయాలు వెళ్లేలా నిర్ణయాలు ఉంటాయంటున్నారు. దీంతో సహజంగానే ఈ రంగం కూడా మార్కెట్లో సానుకూలంగా కనిపించే అవకాశం ఉంది. 
 

ఏది ఏమైనా ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ద్వారా మార్కెట్లకు మంచి చోదకాన్ని ఇచ్చిన ప్రభుత్వం.. 2021 బడ్జెట్ ద్వారా మరెంత ఉద్దీపన ఇస్తారన్నది చూడాలి. ఇప్పటికే లాభాల్లో రికార్డు మోతలు మోగిస్తున్న స్టాక్ మార్కెట్లో బడ్జెట్ మరింత ఊపునిస్తుందా... లేక కార్పొరేట్ వర్గాలను నిరుత్సాహపరిచి కరెక్షన్ వచ్చేలా చేస్తుందా..