వరుసగా ఐదో రోజూ దేశీయ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయి సైకలాజికల్ లెవల్ 53వేల దిగువకు, నిఫ్టీ కీలక స్థాయి 16 వేల దిగువకు పడిపోయాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఇవాళ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. ముఖ్యంగా మెటల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ్టి నష్టాలను లీడ్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు వెయ్యి పాయింట్లు కోల్పోయి 33700 సమీపంలో ట్రేడవుతోంది.
ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కోలు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. నిఫ్టీ-50లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్‌లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, అదాని పోర్ట్స్లు 5శాతం పైగా, టాటా స్టీల్, టాటా మోటార్స్‌లు మూడున్నర శాతం పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
రూ.5 లక్షల కోట్లు ఆవిరి..
క్రితం ముగింపుతో పోలిస్తే ఇవాళ ఇన్వెస్టర్ల సంపద మరో రూ.5లక్షల కోట్లు కరిగిపోయింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఇవాళ రూ.246.31 లక్షల కోట్ల నుంచి రూ.241.15 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇవాళ ఇప్పటివరకు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ విలువ రూ.5.16 లక్షల కోట్లు తగ్గిందన్నమాట. ఏప్రిల్ 11న రూ.275.17 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ గత నెలరోజుల్లో రూ.34.02 లక్షల కోట్ల విలువ క్షీణించింది.
నష్టాలకు కారణాలివే..!
1. యుఎస్ ద్రవ్యోల్బణం :
పెరుగుతోన్న ద్రవ్యోల్బణం రేటుతో ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఇబ్బందులకు లోనవుతోన్నాయి. తాజాగా వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీగా చెప్తోన్న అమెరికా సీపీఐ డేటా అంచనాలను అందుకోలేకపోయింది. ఏకంగా 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు పెరిగిపోయింది. ఏప్రిల్‌లో అమెరికా ద్రవ్యోల్బణం రేటు 8.3శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో మరోవిడత వడ్డీరేట్ల పెంపునకు యూఎస్ ఫెడ్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2. డాలర్ పైపైకి... ఆసియా మార్కెట్లలో మాత్రం కరెక్షన్
డాలర్ మారకం విలువ రెండు దశాబ్దాల గరిష్టానికి చేరింది. ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే డాలర్ మారకం విలువ గత కొద్దిరోజులుగా బలపడుతూనే ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడే దేశాలపై అధిక భారం పడనుంది.
3. FPO అవుట్‌ఫ్లో...
ఈ ఏడాది ప్రారంభం నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. నిన్న మరో రూ.3609.35 కోట్ల షేర్లను ఎఫ్‌పీఐలు విక్రయించారు. దీంతో మే నెల్లో ఇప్పటివరకు రూ.17,403 కోట్లకు వెనక్కి తీసుకున్నారు. అలాగే 2022లో ఇప్పటివరకు రూ.1,44,565 కోట్ల షేర్లను ఎఫ్‌పీఐలు అమ్మివేశారు.
4. భారత ద్రవ్యోల్బణం డేటాపై ఆసక్తి..
ప్రపంచ ఆర్థిక మందగమనంతో ప్రభావంతో భారత వృద్ధి అంచనాలను రేటింగ్ సంస్థలు తగ్గిస్తున్నాయి. ఇక ఇవాళ విడుదలయ్యే భారత సీపీఐ డేటాపై ఇన్వెస్టర్లు పెద్ద ఆశలు పెట్టకున్నారు. అయితే ప్రస్తుతం పెట్రోల్ ధరలు దేశంలో చుక్కలనంటడంతో ద్రవ్యోల్బణం కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.