అసలు IPO నిబంధనలు.. ఎలా షేర్లు కేటాయిస్తారో తెలుసా

2021-05-04 09:28:59 By Y Kalyani

img

అసలు IPO నిబంధనలు.. ఎలా షేర్లు కేటాయిస్తారో తెలుసా

 2020 ఆర్థిక సంత్సరం చివరి నుంచి ఇప్పటివరకూ డజన్ల కొద్దీ కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. వేల కోట్ల రూపాయిలు ప్రైమరీ మార్కెట్ నుంచి రాబట్టాయి. IPO గురించి తరచుగా వింటుంటాం.. షేర్లకు ధరఖాస్తు చేస్తుంటాం.. ఇంతకీ దీని నియమ నిబంధనలు తెలుసా.. కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్లు ఇది తెలుసుకుంటే మంచిది.

గడిచిన ఐదేళ్లలో...
2017లో 89 కంపెనీలు, 2018లో 88, 2019లో 49, 2020లో 31 కంపెనీలు ఇక 2021 మార్చి 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి వచ్చాయి. 

ఐపీఓ అంటే... 
రెగ్యులర్ ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు ఐపీఓ పదం కొత్తేమీ కాదు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ నే IPO అంటారు. వ్యాపార సంస్థలు కేపిటల్ సమీకరణ చేయడానికి దీనిని ఆశ్రయిస్తాయి. వ్యాపార విస్తరణ వంటి అవసరాల కోసం నిధులు సేకరించడానికి స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్ అవుతుంటాయి. డీమ్యాట్ ఖాతాలు ఉండి దరఖాస్తు చేసుకున్నవారికి తమ సంస్థ షేర్లను విక్రయించడం ద్వారా ఈ నిధులు సమీకరిస్తారు. 

ఏ కంపెనీ అయినా ఐపీఓ‌కు వెళ్లొచ్చా..
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI నిబంధనల ప్రకారం ఐపీఓకు వెళ్లాల్సి ఉంటుంది. కంపెనీ, దాని ప్రమోటర్లకు సంస్థలో సెబీ ప్రమాణాల ప్రకారం కనీస వాటాలు కలిగి ఉండాలి. కంపెనీ మనుగడలో ఉండాలి. అంతేకాదు.. బ్యాలెన్స్ షీట్లు స్పష్టంగా ఉండాలి. సంస్థ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవడానికి ముందు మూడేళ్లలో ప్రతి ఏడాదీ దాని స్థిరాస్తుల విలువ రూ. 3 కోట్లకు తగ్గకుండా ఉండాలి. ఐపీఓకు ముందు అయిదేళ్లలో కనీసం మూడు సంవత్సరాలు ఏటా రూ. 15 కోట్లకు తగ్గకుండా రెవిన్యూ వచ్చి ఉండాలి. అయితే ప్రస్తుతం నిబంధనలు మార్చారు. పబ్లిక్ ఇష్యూ పరిమాణం.. అది జారీ చేయడానికి ముందున్న నికర విలువ కంటే 5 రెట్లు దాటకూడదు.

ధర ఎలా నిర్ణయిస్తారు...
సాధారణంగా ఐపీఓ షేర్ ధర నిర్ణయం రెండు విధానాల్లో ఉంటుంది. మొదటిది బుక్ బిల్డింగ్ పద్ధతి. ఇందులో ఐపీఓ‌కు వచ్చిన సంస్థకు చెందిన షేర్ ధరను నిర్ణీత వ్యవధిలో నిర్ణయిస్తారు. అంటే కనిష్ఠ, గరిష్ఠ ధర ఉంటుందన్నమాట. దరఖాస్తు చేసుకునేవారు ఆ రేంజ్‌లోనే కోట్ చేయాలి. రెండోది ఫిక్స్‌డ్ ప్రైస్ పద్ధతి.. ఈ విధానంలో ముందే ధరను కచ్చితంగా నిర్ణయిస్తారు. కంపెనీ తన ఆఫర్ డాక్యుమెంట్‌లో ఈ ధర, కనీసం ఎన్ని షేర్లు కొనాలి.. కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలి.. వంటి వివరాలన్నీ స్పష్టం చేస్తుంది. 

ఓపెన్ ఆఫర్ ఎన్నిరోజులు...
ఐపీఓ ప్రకటించిన తరువాత గరిష్ఠంగా 10 రోజులు వరకూ ఉంటుంది. కనీసం మూడు రోజులు అందుబాటులో ఉండాలి. అంటే.. 3 నుంచి 10 రోజుల వరకు ఐపీఓ అందుబాటులో ఉంటుంది. బుక్ బిల్డింగ్ పద్ధతిలో అయితే గరిష్ఠంగా 7 రోజులు అందుబాటులో ఉంటుంది. ప్రైస్ రేంజ్‌లో ఏమైనా మార్పులు చేస్తే మరో 3 రోజులు అదనపు సమయం ఇస్తారు.

దరఖాస్తు ఎలా.... 
ఐపీఓ కావాలనుకున్నవారు దరఖాస్తు చేసుకోవాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఐపీఓ ప్రకటించిన సంస్థ వెల్లడించిన తేదీలలో తమ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ట్రేడింగ్ ఖాతా ద్వారా కానీ ఆ ఐపీఓ‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఐపీఓ దరఖాస్తు ప్రకారం ఎంత మొత్తం పెట్టుబడికి నిర్దేశించారో అదంతా మీ ఖాతాలో బ్లాక్ అవుతుంది. ఐపీఓలో మీకు కేటాయించిన షేర్లను బట్టి అందులో మినహాయించుకుని మిగతాది ఖాతాలో రిలీజ్ చేస్తారు. అసలు కేటాయింపు లేకపోతే మొత్తం డబ్బు రిలీజ్ అవుతుంది. 

షేర్లు ఎలా కేటాయిస్తారు..
షేర్ల కేటాయింపు లాటరీ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి దరఖాస్తు చేసుకున్నవారందరికీ షేర్లు రాకపోవచ్చు. సంస్థ ఐపీఓకు వచ్చినప్పుడే కనీస షేర్ల సంఖ్యను వెల్లడిస్తుంది.. దాన్నే లాట్ అంటారు. ఆ లాట్ కంటే తక్కువ షేర్లు కోరుతూ దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు తిరస్కరిస్తారు. అలాగే లాట్ ప్రకారమే దరఖాస్తు చేసినా ఒక్కోసారి కోరుకున్నన్ని షేర్లు కేటాయించకపోవచ్చు. మొత్తం ఎన్ని షేర్లు అందుబాటులో ఉన్నాయి.. ఎన్ని బిడ్‌లు దాఖలయ్యాయి.. అనేదాన్ని బట్టి షేర్ల కేటాయింపు ఉంటుంది. సంస్థ కేటాయించిన ప్రకారం ఇష్యూ ముగిసినప్పటి నుంచి 5 రోజుల్లోగా మదుపరుల డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు జమ అవుతాయి.

షేర్ల జారీ విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగినా, డబ్బులు రీఫండ్ కావడంలో సమస్యలు ఏర్పడినా ఐపీఓ జారీ చేసిన కంపెనీ ఫిర్యాదుల విభాగాన్ని సంప్రదించాలి. అక్కడ పరిష్కారం కాకపోతే సెబీకి ఫిర్యాదు చేయాలి.


ipo market trends stocks bse nifty

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending