ఓయో ఐపీఓకు జోస్టల్ షాక్.. సెబీ కనుక రంగంలోకి దిగితే కష్టాలే..

2021-10-12 10:19:18 By VANI

img

ప్రారంభ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ద్వారా నిధుల సమీకరణకు ఓయో సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా ఓయోకి భారీ ఝలక్‌ తగిలింది. ప్రత్యర్థి కంపెనీ జోస్టల్‌.. ఓయో దాఖలు చేసిన డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్‌పెక్టస్‌(DRHP) నిబంధనలకు విరుద్ధంగా ఉందని కాబట్టి కంపెనీ ఐపీవో ప్రతిపాదనను తిరస్కరించాలంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఓ లేఖ రాసింది. అలాగే ఓయో ఐపీవో ప్రతిపాదనను తిరస్కరించాలని సెబీకి జోస్టల్‌ విజ్ఞప్తి చేసింది. 

 

1.2 బిలియన్‌ డాలర్ల( రూ.8,430 కోట్లు) సమీకరణకు ఓయో సిద్ధమైన విషయం తెలిసిందే. జులైలో ఫుడ్‌ యాప్‌ జొమాటో ఐపీవో మంచి సక్సెస్ సాధించిన అనంతరం ఓయో కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమైంది. దీనిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చేందుకు ఓయో మాతృ సంస్థ ఓరావెల్‌ స్టేస్‌ వాటాదార్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఓయో మాతృ సంస్థ ఓరావెల్‌ స్టేస్‌..  క్యాపిటల్‌ స్ట్రక్చర్‌ ఇంకా తుది రూపానికి రానప్పుడు ఐపీవోకి ఎలా వెళుతుందని జోస్టల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది‌. ఈ క్రమంలోనే ఐపీవోకు అనుమతి ఇవ్వొద్దని సెబీని జోస్టల్ కోరింది. ఇక జోస్టల్ లేవనెత్తిన అభ్యంతరాలను సెబీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఓయోకి చిక్కులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఓయో ఐపీఓ ద్వారా రూ.7,000 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.1,430 కోట్ల విలువైన షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా ఎస్‌వీఏఎఫ్‌ ఇండియా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఏ1 హోల్డింగ్స్‌, చైనా లాడ్జింగ్‌ హోల్డింగ్స్‌, గ్లోబల్‌ ఐవీవై వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ షేర్లను విక్రయించనున్నాయి. ప్రస్తుతం ఓయోలో ఎస్‌వీఎఎఫ్‌ 46.62%, ఆర్‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌కు 24.94%, రితేశ్‌ అగర్వాల్‌కు 8.21% వాటాలు ఉన్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, వాణిజ్య విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూకు లీడ్ మేనేజర్స్‌గా జేపీ మోర్గాన్, సిటీ, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లు పనిచేయనున్నాయి.


Zostal  Oyo  JP Morgan  Kotak Mahindra Capital  Zomato

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending