ఎన్నో అంచనాలతో నిధుల సమీకరణ చేపట్టిన ఎల్ఐసీ ఐపీఓకు కేవలం మూడు రెట్ల సబ్స్క్రిప్షన్ లభించింది. గతంలో ఓసారి వాయిదా పడినప్పటికీ... ఎట్టకేలకు ఈనెల్లో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అయితే రష్యా-ఉక్రెయిన్ల మధ్య సంక్షోభం కొనసాగుతుండటం, పెరుగుతోన్న ద్రవ్యోల్బణ భయాలతో ప్రపంచ మార్కెట్లన్నీ మళ్ళీ ఒత్తిడికి లోనవుతోన్నాయి. దీంతో ఐపీఓ క్లిక్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో సబ్‌స్క్రిప్షన్‌ను సంపాదించలేకపోయింది ఎల్ఐసీ. కేవలం 2.95 రెట్ల స్పందనతోనే సరిపెట్టుకుంది.
ఎల్ఐసీ ఇష్యూకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 2.83 రెట్లు అధికంగా బిడ్లు దాఖలు కాగా... సంస్థాగతేతర విభాగంలో 2.91 రెట్ల స్పందన వచ్చింది. రిటైల్ విభాగంలో 1.99 రెట్లు, పాలసీదార్ల విభాగంలో 6 రెట్లు, ఉద్యోగుల విభాగంలో 4.4 రెట్ల స్పందన లభించింది. ఈనెల 12న ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది. ఈనెల 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది.
డిస్కౌంట్‌తోనే లిస్ట్ కావచ్చని అంచనాలు..
పబ్లిక్ ఇష్యూ ప్రారంభంలో గ్రేమార్కెట్ ప్రీమియం ఆశలు లేపినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ స్టాక్ డిస్కౌంట్‌తోనే లిస్ట్ కావచ్చని అంచనాలున్నాయి. బుధవారం గ్రేమార్కెట్లో ఈ స్టాక్ నెగిటివ్ జోన్లోకి మళ్ళడంతో ఈ ఐపీఓకు అప్లయ్ చేసిన ఇన్వెస్టర్లలో నిరుత్సాహం నెలకొంది. ఒక దశలో రూ.93-95గా ఉన్న గ్రేమార్కెట్ ప్రీమియం ప్రస్తుతం మైనస్ రూ.15 (డిస్కౌంట్ రూ.15)కు పడిపోయింది. దీంతో ఒలటాలిటీ మార్కెట్లో ఇన్వెస్టర్ల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి.
ఎఫ్ఐఐల స్పందన అంతంతే...
ఎల్ఐసీ ఐపీఓకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఓ మోస్తారు స్పందన మాత్రమే లభించింది. దీంతో గ్రేమార్కెట్ ప్రీమియం గరిష్ట స్థాయి నుంచి క్రమంగా నెగిటివ్ జోన్లోకి మళ్ళింది. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడంతో ఆర్థిక అస్థిరత పెరిగి ఇన్వెస్టర్లను అయోమయానికి గురి చేస్తోంది.
ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే ఎల్ఐసీ తక్కువ వాల్యుయేషన్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే డిస్కౌంట్‌తోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తీసుకున్న నిర్ణయాలు వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో సంస్థ నష్టాలు పెరగడం, మార్కెట్ వాటాను కోల్పోడం, డిజిటల్ రంగంలో బలహీనంగా ఉండటం సంస్థకు మైనస్ పాయింట్లని వారు చెబుతున్నారు.