ఎల్ఐసీ ఐపీఓ... రూ.15 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ !

2022-01-13 09:33:59 By VANI

img

గత ఏడాది నుంచి తెగ ఊరిస్తోంది ఎల్‌ఐసీ ఐపీఓ. ఈ ఐపీఓ కోసం ఇన్వెస్టర్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడిప్పుడే ఈ బాహుబలి రాకపై క్లారిటీ వస్తోంది. అయితే పబ్లిక్‌ ఇష్యూకి ముందే ఎల్‌ఐసీ ఐపీఓపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.15 లక్షల కోట్లుండేలా చూడాలని ప్రభుత్వం ఆశిస్తున్నట్టు సమాచారం. ఎల్‌ఐసీ ప్రస్తుత ఆస్తులు, భవిష్యత్‌ లాభాల విలువకు ఇది దాదాపు నాలుగు రెట్లు. 

 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నెల చివరి వారంలో రూ.15 లక్షల కోట్ల పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ప్రాథమిక పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశం యొక్క అతిపెద్ద పబ్లిక్ ఆఫర్‌ కోసం జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో రాష్ట్ర-రక్షణ బీమా సంస్థ పత్రాలను దాఖలు చేస్తుంది. ప్రాస్పెక్టస్‌లో ఎల్‌ఐసీ ఎంబెడెడ్ విలువతో పాటు ఆఫర్‌లో ఉన్న షేర్ల సంఖ్యను తెలియజేస్తుందని నివేదిక పేర్కొంది.

 

రూ.15 లక్షల కోట్లు ఉంటే మాత్రం భారత క్యాపిటల్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ తర్వాత ఎల్‌ఐసీ అతి పెద్ద మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీగా అవతరిస్తుంది. ప్రస్తుతం రూ.17 లక్షల కోట్లతో రిలయన్స్‌, రూ.14.3 లక్షల కోట్లతో టీసీఎస్‌ భారత స్టాక్‌ మార్కెట్‌లో అతి పెద్ద కంపెనీలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఆశిస్తున్నట్టు మదుపరులు ఆదరిస్తే టీసీఎస్‌ను పక్కకు నెట్టి ఎల్‌ఐసీ, రెండో అతి పెద్ద  కంపెనీగా అవతరించనుంది. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సెబీకి దరఖాస్తు చేయాలని భావిస్తున్నారు. మార్చిలోగా మార్కెట్‌కు వచ్చే ఈ బాహుబలి ఐపీఓ భారత క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద ఐపీఓ కానుంది. 

 

2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.1.75-లక్షల కోట్ల ఉపసంహరణ లక్ష్యానికి చేరువ కావడానికి పబ్లిక్ ఇష్యూ విజయం చాలా కీలకం కానుంది. పీఎస్‌యూ వాటా విక్రయం ద్వారా ఇప్పటివరకు రూ.9,330 కోట్లు మాత్రమే సమకూరింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ పెట్టుబడుల ఉపసంహరణను సులభతరం చేయడానికి, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) విధానంలో కొన్ని మార్పులను ప్రవేశపెట్టింది.
 


LIC  IPO  Market Cap  Prospectus  Bahubali