యూఎస్‌ ఫెడ్‌ కీలక నిర్ణయం, భారీగా పెరిగిన వడ్డీరేట్లు 

2022-06-16 08:53:49 By Marepally Krishna

img

- అమెరికాలో భారీగా పెరిగిన వడ్డీరేట్లు 
- వడ్డీరేటు 0.75 శాతం పెంచిన ఫెడరల్ రిజర్వ్‌ 
- ఈ స్థాయి పెంపు 1994 తరువాత ఇదే మొదటిసారి
- అమెరికాలో మండిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు 
- ఆర్థిక వ్యవస్థలో డబ్బు చెలామణిని తగ్గించే ప్రయత్నం
- వడ్డీరేట్ల వాత ఇక్కడితోనే ఆగిపోదన్న ఫెడ్ ఛైర్మన్ పావెల్
- జులైలో మరోసారి పెంచుతామని స్పష్టమైన సంకేతాలు
- మళ్లీ 0.75 శాతం వరకు వడ్డీరేట్లు పెంచొచ్చని స్టేట్‌మెంట్
- వడ్డీరేట్లు పెరగడంతో తగ్గిన క్రూడాయిల్ ధరలు 
- డిమాండ్‌ తగ్గొచ్చన్న భయాలతో దిగొచ్చిన క్రూడ్

 

అమెరికాలో వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను 0.75 శాతం పెంచింది. 1994 తరువాత ఈ స్థాయిలో వడ్డీరేట్లు పెంచడం ఇదే మొదటిసారి. అమెరికాలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల నుంచి పెట్రోల్ వరకు ప్రతి ఒక్కదాని ధర పెరిగిపోయింది. రోజు గడవడానికి గతంలో ఎన్నడూ లేనంతగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో డబ్బు చెలామణిని తగ్గించేందుకు వడ్డీరేట్లు పెంచింది యూఎస్ ఫెడ్ రిజర్వ్. 


వడ్డీరేట్ల వాత ఇక్కడితోనే ఆగిపోదని తేల్చి చెప్పారు ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్. ఈ నెల రోజుల పాటు పరిస్థితిని గమనించి జులైలో మరోసారి పెంచుతామని స్పష్టం చేశారు. అప్పుడు కూడా 0.75 శాతం వరకు వడ్డీరేట్లు పెంచొచ్చని అమెరికన్లను ముందుగానే ప్రిపేర్ చేశారు. ధరలు విపరీతంగా పెరుగుతూ పోతే.. డిమాండ్‌ పడిపోతుంది. డిమాండ్ పడిపోతే ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా కంపెనీలు ఉద్యోగులను తీసేయాల్సి వస్తుంది. చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు మూతపడే పరిస్థితి కూడా వస్తుంది. బ్యాంకులకు రుణాలు చెల్లించే వాళ్లు క్రమంగా ఎగవేతదారులుగా మారతారు. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. మెల్లగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటికే, అమెరికాలో మాంద్యం మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు క్వార్టర్ల పాటు దేశ ఆర్థిక వృద్ధిరేటు తగ్గితే మాంద్యంలోకి వెళ్లినట్టే. దీంతో ఆ పరిస్థితి రాకుండా వడ్డీరేట్లను పెంచుతామంటోంది అమెరికా సెంట్రల్ బ్యాంక్. 


అమెరికాలో వడ్డీరేట్లు పెరగడంతో క్రూడాయిల్ ధరలు తగ్గాయి. వడ్డీరేట్లు పెంచడం వల్ల డిమాండ్‌ తగ్గుతుందేమోనన్న భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు దిగి వచ్చాయి.


bse nse stock market bull bear loss profit trading Telugu News