ఆర్థిక ఫలితాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అదుర్స్.. 

2021-10-23 09:34:01 By VANI

img

దేశంలోనే అతి పెద్ద మార్కెట్ కేపిటలైజేషన్ కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఆర్థిక ఫలితాలను అదరగొట్టేసింది. మార్కెట్‌ అంచనాలను సైతం మించిన ఫలితాలను తాజాగా వెలువరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) ఆర్‌ఐఎల్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన గత ఏడాది రూ.9,567 కోట్ల నుంచి 43 శాతం వృద్ధి చెంది రూ.13,680 కోట్లకు చేరుకుంది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఆదాయం 49 శాతం వృద్ధితో రూ.1.74 లక్షల కోట్లకు ఎగిసింది. 

 

ఇక రిలయన్స్‌ ఆయిల్‌ టు కెమికల్‌ (ఓ2సీ) వ్యాపార ఆదాయం వార్షిక ప్రాతిపదికన 58.1 శాతం వృద్ధి చెంది రూ.1.20 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ విభాగ నిర్వహణ లాభం 43.9 శాతం వృద్ధితో రూ.12,720 కోట్లకు చేరింది. సెప్టెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ విభాగ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 74.4 శాతం పెరిగి రూ.1,695 కోట్లకు చేరుకుంది. ఆదాయం 9.2 శాతం వృద్ధితో రూ.39,926 కోట్లుగా నమోదైంది. 

 

జియో:


రిలయన్స్‌కు చెందిన డిజిటల్‌ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ ఏకీకృత నికర లాభం గత సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,019 కోట్ల నుంచి ఈ సెప్టెంబరు త్రైమాసికంలో 23.48 శాతం వృద్ధి చెంది రూ.3,728 కోట్లకు చేరకుంది. సమీక్షా కాలానికి ఈ విభాగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 12.5 శాతం పెరిగి రూ.23,222 కోట్లకు చేరుకుంది. జియో టెలికాం వ్యాపారంలో ఒక్కో వినియోగదారు నుంచి లభించే సగటు ఆదాయం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.138.4 నుంచి ఈ సెప్టెంబరు‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.143.6కు పెరిగింది.

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రేంజ్‌లో లాభాలను పోగేసుకోవడంలో కంపెనీకి చెందిన అన్ని వ్యాపార విభాగాలు తమవంతు భాగస్వామ్యాన్ని అందించాయి. ప్రి కొవిడ్ స్థాయికి కంపెనీ రిటైల్‌ వ్యాపార స్టోర్లను సందర్శించే కస్టమర్లు పెరిగారు. చమురు శుద్ధి మార్జిన్లతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల ఇంధన వ్యాపారానికి కలిసి వచ్చింది. టెలికాం విభాగంలో ఒక్కో వినియోగదారు నుంచి ఆర్జించే సగటు ఆదాయం మరింత పెరిగిందని రిలయన్స్‌ పేర్కొంది. 

 

కాగా ఇటీవలే.. ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరో చరిత్ర సృష్టించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత కంపెనీలలో కెల్లా అత్యధిక మార్కెట్ కేపిటలైజేషన్ సాధించింది. రూ.17లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ దక్కించుకుని తన సత్తా చాటింది. గత నెలలోనే( సెప్టెంబర్ 27) రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ కేపిటలైజేషన్ 16లక్షల కోట్లకు చేరగా, ఖచ్చితంగా 10 సెషన్లలోనే మరో లక్ష కోట్లరూపాయలను జత చేసింది. అంతేకాదు 2021 కేలండర్ ఇయర్‌లో ఇప్పటికే ఈ సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ గత ఏడాదితో పోల్చితే, 35.83శాతం పెరగడం విశేషం
 


 Reliance Industries Limited  Mukhesh Ambani  Jio  

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending