ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కెనరా బ్యాంక్ నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో ఇవాళ ఈ స్టాక్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఇంట్రాడేలో షేర్ 5శాతం పైగా నష్టపోయిన కెనరా బ్యాంక్ డే కనిష్ట స్థాయి రూ.124.65కు పడిపోయింది. ప్రస్తుతం 3శాతం నష్టంతో రూ.127.25 వద్ద షేర్ ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈలో ఇవాళ ఇప్పటివరకు 2.25 కోట్ల వాల్యూమ్స్ నమోదయ్యాయి. కెనరా బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,954 కోట్లకు పడిపోయింది.
డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో కెనరా బ్యాంక్ 9 శాతం క్షీణతతో రూ.696 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.764 కోట్లుగా ఉంది. గత ఏడాది ఏప్రిల్‌లో కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. అయితే 2019 డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలను కెనరా బ్యాంక్‌తో కలిసి సిండికేట్ బ్యాంక్ ఉమ్మడిగా ప్రకటించింది.
ఇక మూడో త్రైమాసికంలో కెనరా బ్యాంక్ కేటాయింపు రూ.738 కోట్లు కాగా, అదనంగా మరో రూ.1901 కోట్ల కేటాయింపులు చేయాల్సి ఉండటంతో క్యూ-3లో తమ లాభాలు గణనీయంగా తగ్గాయని కెనరా బ్యాంక్ తెలిపింది. ఎన్పీఏలపై వచ్చిన రూ.413 కోట్ల వడ్డీ ఆదాయాన్ని నికరలాభంలో కెనరా బ్యాంక్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రెండింటిన పరిగణనలోకి తీసుకుంటే తమ నికరలాభం రూ.1500 కోట్ల వరకు ఉండేదని కెనరా బ్యాంక్ తెలిపింది. ఇక క్యూ-3లో నికర వడ్డీ ఆదాయం 14.58శాతం వృద్ధితో రూ.6081 కోట్లకు పెరిగింది.