ఇకపై బిగ్‌బాస్కెట్.. ఆఫ్‌లైన్ వయా ఆన్‌లైన్.. అంతా సెల్ఫ్ సర్వీసే..

2021-11-25 10:21:22 By VANI

img

ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్‌బాస్కెట్‌ తాజాగా ఆఫ్‌లైన్‌ రిటైల్‌ విభాగంలోకి ప్రవేశించింది. ఆన్‌లైన్ సేవలు మరింత ఆలస్యమవుతున్నాయంటూ వినియోగదారుల నుంచి విరివిగా కంప్లైంట్స్ వస్తున్నాయి. దీంతో బిగ్‌బాస్కెట్‌కు ఆదరణ కూడా చాలా వరకూ తగ్గిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలోకి బిగ్‌బాస్కెట్ ప్రవేశించనుంది. తాజాగా కొత్తగా టెక్నాలజీ ఆధారిత, సెల్ఫ్‌ సర్వీస్‌ ’ఫ్రెషో’ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాలి.. ఆఫ్‌లైన్‌లో సరకులను తీసుకెళ్లాలి.

 

క్రమక్రమంగా స్టోర్ల సంఖ్యను బిగ్‌బాస్కెట్ యాజమాన్యం పెంచనుంది. 2023 నాటికి దేశవ్యాప్తంగా 200 భౌతిక స్టోర్లు, 2026 నాటికి 800 స్టోర్లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికల్లో భాగంగా దీన్ని ఆవిష్కరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తమ స్టోర్ల ద్వారా అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను.. అది కూడా ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే మరింత చౌకగా అందిస్తామని ఆయన వివరించారు.

ఈ స్టోర్స్‌లో నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బిగ్‌బాస్కెట్‌లో తమకు కావాల్సినవి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి, వీలును బట్టి ఫ్రెషో స్టోర్స్‌ నుంచి వాటిని తీసుకెళ్లవచ్చని మీనన్‌ చెప్పారు. కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులను తీసుకుని ఆటోమేటిక్‌ కంప్యూటర్‌ విజన్‌ ఉండే కౌంటర్‌లో తూకం వేయొచ్చన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో సెల్ఫ్‌ బిల్లింగ్‌ కౌంటర్లు ఆటోమేటిక్‌గా బిల్లును రూపొందిస్తాయని హరి మీనన్ పేర్కొన్నారు. మొత్తానికి ఆఫ్‌లైన్‌ సేవల ద్వారా ఓ వినూత్న కార్యక్రమానికి బిగ్‌బాస్కెట్ శ్రీకారం చుట్టింది. మరి ఇది ఎంతమేరకు సత్ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి. 
 


Bigbosket  Fresho Store  Hari Menon

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending