STP ఎందుకు? ఎలా?

STP ఎందుకు? ఎలా?

మ్యూచువల్ ఫండ్స్‌కు క్రేజ్ పెరిగిన తర్వాత ఎస్ఐపీ(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) గురించి జనాలకు బాగానే తెలిసింది. ఇంకా కొన్ని అనుమానాలు జనాల్లో ఉన్నా.. ఎస్ఐపీతో ఉపయోగాలు ఎక్కువే అనే విషయానికి బాగానే ప్రచారం లభించింది. మార్కెట్స్ పడిపోయినపుడు కూడా ప్రయోజనం చేకూర్చే ఎస్ఐపీలకు జనాలు బాగానే మొగ్గు చూపుతున్నారు. 

 

ఎస్ఐపీతో పాటే ఎస్‌టీపీ అనే మరో పెట్టుబడి విధానం ఉంది. ఎస్‌టీపీ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. అంటే క్రమానుగతంగా కాలానుగుణంగా పెట్టుబడులను బదలాయించడం. మ్యూచువల్ ఫండ్‌లో చేసిన పెట్టుబడి ద్వారా చేకూరిన యూనిట్లను మొత్తం కాని, నిర్ణీత యూనిట్లను కానీ.. అదే మ్యూచువల్ ఫండ్ హౌస్‌లో ఇతర ఫండ్ హౌస్‌లోకి మార్చుకునే అవకాశం ఉన్నదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్. అంటే మీరు ఎంపిక చేసుకున్న మొత్తం/యూనిట్లు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి మరో స్కీంకు నిర్ణీత సమయాల్లో మార్చుకుంటూ ఉండడం అన్న మాట.

 

ఎస్‌టీపీలలో పలు రకాలు ఉండడమే కాదు.. పలు ప్రయోజనాలు కూడా ఉంటాయి. 


స్థిరమైన రాబడులు:

మీరు డెట్ లేదా లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడి చేసి ఉన్నట్లయితే, ఎస్‌టీపీ ద్వారా ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఈక్విటీ ఫండ్‌లోకి మార్చుకోవచ్చు. అపుడు బదలాయించిన మొత్తానికి ఈక్విటీ ఫండ్స్ ద్వారా రాబడులు అందుకుంటూనే, మిగిలిన మొత్తాన్ని డెట్ ఫండ్స్‌లోనే ఉంచడం ద్వారా పెట్టుబడికి రక్షణ పొందవచ్చు.

 

ధరల సగటు:

ఎస్ఐపీ మాదిరిగానే ఎస్‌టీపీలో కూడా నిర్ణీత కాల వ్యవధిలో పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్ఐపీ మాదిరగా పెట్టుబడి చేయడం ద్వారా సమకూరే యూనిట్ల కొనుగోలు ధర సగటు ప్రకారం ఎప్పుడూ తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. 

 

పోర్ట్‌ఫోలియో సమతూకం పాటించడం:

డెట్ నుంచి ఈక్విటీ లేదా లిక్విడ్‌ ఫండ్స్.. ఈక్విటీ నుంచి డెట్ లేదా లిక్విడ్ ఫండ్స్‌కు.. లిక్విడ్ నుంచి ఈక్విటీ లేదా డెట్ ఫండ్స్‌కు పెట్టుబడులను మార్చుకునే అవకాశం ఎస్‌టీపీ కల్పిస్తుంది. డెట్ ఫండ్ ద్వారా చేకూరిన ప్రయోజనాన్ని ఈక్విటీల్లో పెట్టుబడి చేసేందుకు, ఈక్విటీల్లో చేసే ఫండ్స్ రాబడులను డెట్ ఫండ్స్‌లోకి మార్చుకునేందుకు అవకాశాన్ని ఎస్‌టీపీ కల్పిస్తుంది.

 

ఏ ఫండ్ నుంచి ఏ ఫండ్‌కు బదలాయించాలనే అంశాన్ని ఇన్వెస్టర్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. రోజు, వారం, నెల, త్రైమాసికం.. ఇలా నచ్చినపుడు ఎస్‌టీపీ పెట్టుబడులను ఎప్పుడైనా తమ ఇష్ట ప్రకారం మార్చుకునే అవకాశం ఏఎంసీలో ఉంటుంది. 


ఒక వేళ లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కు పెట్టుబడిని మార్చాలని ఇన్వెస్టర్ కోరుకుంటే, లిక్విడ్ లేదా షార్ట్-టెర్న్ ప్లాన్‌లో ఉన్న ఏకమొత్తం పెట్టుబడిని.. నిర్ణీత కాలవ్యవధిలో ఎంపిక చేసిన ఈక్విటీ ఫండ్‌లోకి మార్చడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు ఈక్విటీల్లో 50,000 ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే, మీరు ఏకమొత్తాన్ని లిక్విడ్ ప్లాన్‌లోకి మార్చుకోవచ్చు. అలాగే ఎస్ఐపీ ద్వారా నెలనెలా 5,000 చొప్పున ఈక్విటీ ప్లాన్‌లోకి బదలాయించవచ్చు. ఏఎంసీ స్కీమ్స్ ప్రకారం ఎస్‌టీపీలలో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది.

 

సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్స్ మూడు రకాలుగా ఉంటాయి.

  1. ఫిక్సెడ్ ఎస్‌టీపీ,
  2. కేపిటల్ అప్రిసియేషన్‌ ఎస్‌టీపీ,
  3. ఫ్లెక్సి ఎస్‌టీపీ

 

ఫిక్సెడ్ ఎఫ్‌టీపీ:

ఫిక్స్‌డ్ ఎస్‌టీపీలలో పెట్టుబడి మొత్తాన్ని ఒక పెట్టుబడి సాధనం నుంచి మరో పెట్టుబడి సాధనంలోకి ఇన్వెస్టర్ మార్చకోవచ్చు.


కేపిటల్ అప్రిసియేషన్ ఎస్‌టీపీ:

ఈ ఎస్‌టీపీలో ఒక పెట్టుబడిపై వచ్చిన రాబడిని మరో పెట్టుబడి సాధనంపై ఇన్వెస్ట్‌ చేయవచ్చు.


ఫ్లెక్సి ఎస్‌టీపీ:

ఇందులో పెట్టుబడి చేసిన వ్యక్తికి ఎంత మొత్తాన్ని నిర్ణయిస్తే అంత మేరకు బదలాయించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఫిక్సెడ్ అమౌంట్ కనీస మొత్తంగా ఉండగా.. మార్కెట్ ఊగిసలాట ధోరణి ప్రకారం అస్థిరమైన మొత్తం ఉంటుంది. 

 

అంటే, ఎస్‌టీపీ ముఖ్యంగా ఏకమొత్తంగా నగదు ఉండి, మార్కెట్ పరిస్థితుల ప్రకారం ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు చేయాలని అనుకునేవారికి ఉపయోగపడుతుంది. లిక్విడ్ లేదా డెట్ ఫండ్స్‌లో నిధులను ఉంచి, ఎస్‌టీపీ ద్వారా సమయానుగుణంగా నిర్ణయించుకున్న ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి చేసేందుకు ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. 

 

పెట్టుబడి వ్యూహాల్లో ఎస్ఐపీ తర్వాత ఎస్‌టీపీకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. మార్కెట్‌లు బుల్ రన్‌లో ఉన్నపుడు ఈక్విటీలలోకి మారడం ద్వారా రాబడులను పెంచుకుని.. బేరిష్ జోన్‌లోకి జారుకున్నపుడు డెట్ వంటి ఇతర విధానాల్లోకి మారడం ద్వారా పెట్టుబడులకు రక్షణ పొందడంతో పాటు రాబడులను పెంచుకునే అవకాశం ఉంటుంది. 
 



Most Popular