అపోలో మైక్రోసిస్టమ్స్‌ ఐపీవో @270-275

అపోలో మైక్రోసిస్టమ్స్‌ ఐపీవో @270-275

గతేడాది(2017) దేశ స్టాక్‌ మార్కెట్ చరిత్రలో రికార్డు సృష్టించిన ప్రైమరీ మార్కెట్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఊరించనుంది. ప్రస్తుతం వైమానిక, రక్షణ, రవాణా రంగాలకూ సమీకృత సేవలు అందిస్తున్న హైదరాబాద్‌ సంస్థ అపోలో మైక్రోసిస్టమ్స్‌ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 10న ప్రారంభంకానున్న ఇష్యూకి రూ. 270-275 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. షేరు ముఖ విలువ రూ. 10కాగా..  ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 156 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. నిధులను అదనపు వర్కింగ్‌ కేపిటల్‌గానూ.. సాధారణ పాలనా అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. 2017లో ఐపీవోల ద్వారా దేశీ కార్పొరేట్‌ సంస్థలు సమారు రూ. 75,000 కోట్లను సమీకరించిన విషయం విదితమే. 
రిటైలర్లకు డిస్కౌంట్‌
జనవరి 12న ముగియనున్న ఇష్యూలో భాగంగా అపోలో మైక్రో.. అర్హతగల ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరు ధరలో రూ. 12 డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. రిటైలర్లు కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై రూ. 2 లక్షల మొత్తానికి మించకుండా అప్లై చేసుకోవచ్చు. అపోలో మైక్రోసిస్టమ్స్‌ ప్రధానంగా ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రో మెకానికల్‌, ఇంజినీరింగ్‌ డిజైన్లతో మిషన్‌, క్రిటికల్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది. మార్చితో ముగిసిన 2016-17లో ఆదాయం రూ. 212 కోట్లకు చేరగా..  రూ. 18 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. 



Most Popular