ఫ్యూచర్‌ సప్లై చైన్‌ ఐపీవో సక్సెస్‌!

ఫ్యూచర్‌ సప్లై చైన్‌ ఐపీవో సక్సెస్‌!

లాజిస్టిక్స్‌ రంగంలో కార్యకలాపాలు కలిగిన ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ సక్సెస్‌ అయ్యింది. ఈ నెల 6న ప్రారంభమై శుక్రవారం(8న) ముగిసిన ఇష్యూకి 7.4 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 660-664 కాగా.. తద్వారా కంపెనీ రూ. 650 కోట్లను సమీకరించాలని భావించింది. ఆఫర్‌లో భాగంగా 24.43 శాతం వాటాకు సమానమైన దాదాపు 98 లక్షల షేర్లను విక్రయానికి ఉంచింది. ఇష్యూ ద్వారా బిగ్‌ బజార్‌ స్టోర్ల కిశోర్‌ బియానీ గ్రూప్‌ నుంచి మరో సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. 
బిడ్స్‌ ఇలా..
ఐపీవోలో భాగంగా యాంకర్‌ పోర్షన్‌పోను 68.49 లక్షల షేర్లను ఫ్యూచర్‌ సప్లై చైన్‌ అమ్మకానికి పెట్టింది. 5 కోట్ల షేర్లకుపైగా బిడ్స్‌ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 12.4 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 11 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 3.2 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. ఐపీవో నిధుల్లో రూ. 150 కోట్లు మాతృ సంస్థ ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు లభించనుండగా.. మరో రూ. 350 కోట్లు కంపెనీలో మొదట్లో ఇన్వెస్ట్‌చేసిన గ్రిఫిన్‌ పార్టనర్స్‌కు దక్కనున్నాయి.
యాంకర్‌ నిధులు
ఐపీవోలో భాగంగా ఫ్యూచర్‌ సప్లై చైన్‌ 5న 16 యాంకర్‌ ఇన్వెస్టర్‌ సంస్థల నుంచి రూ. 195 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 664 ధరలో 2.93 మిలియన్‌ షేర్లను విక్రయించింది. కంపెనీ ఐటీ ఆధారిత వేర్‌హౌసింగ్‌, పంపిణీ, తదితర లాజిస్టక్‌ సేవలను అందిస్తోంది. ఈ రంగంలో ఇటీవలే మహీంద్రా గ్రూప్‌ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్‌ స్టాక్‌ ఎక్సేంజీలలో లిస్టయ్యింది. 



Most Popular