జీఐసీ ఐపీవో- రిటైలర్లకు డిస్కౌంట్‌!

జీఐసీ ఐపీవో- రిటైలర్లకు డిస్కౌంట్‌!

ప్రభుత్వ రంగ సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(జీఐసీ) పబ్లిక్‌ ఇష్యూ నేడు(13న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 855-912కాగా.. తద్వారా కంపెనీ రూ. 11,370 కోట్లను సమీకరించనుంది. వెరసి దేశీయంగా మూడో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా నిలవనుంది. ఇంతక్రితం ఐపీవోల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా రూ. 15,200 కోట్లు, రిలయన్స్‌ పవర్‌ రూ. 11,700 కోట్లను సమకూర్చుకోవడం ద్వారా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ ధరలో రూ. 45 డిస్కౌంట్‌ను జీఐసీ ప్రకటించింది. షేరు ముఖ విలువ రూ. 5 కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 16 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 
రెండో రోజుకి 80 శాతం  
ఇష్యూ రెండో రోజు(12)కల్లా 90 శాతం బిడ్స్‌ దాఖలయ్యాయి. బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ రూ. 8,000 కోట్ల విలువైన బిడ్స్‌ వేసింది. ఆఫర్‌లో భాగంగా జీఐసీ 12.47 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 11.16 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి.
కంపెనీ వివరాలివీ
స్థూల ప్రీమియం వసూళ్ల ప్రకారం జీఐసీ అతిపెద్ద సాధారణ బీమా కంపెనీగా చెప్పవచ్చు. దేశీయంగా 60 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. ఆస్తులకు అగ్నిప్రమాద బీమాతోపాటు.. మెరైన్‌, మోటార్‌, ఇంజినీరింగ్‌, వ్యవసాయం, విమానయానం, ఆరోగ్యం, తదితర రంగాలలో బీమా సౌకర్యాలను కల్పిస్తోంది. వెరసి ఆసియాలోనే మూడో పెద్ద బీమారంగ సంస్థగా నిలుస్తోంది. కంపెనీ మార్చితో ముగిసిన గతేడాది(2016-17)లో దాదాపు రూ. 4,000 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 3140 కోట్ల నికర లాభం ఆర్జించింది.



Most Popular