ఐఈఎక్స్‌ ఐపీవో గట్టెక్కింది!

ఐఈఎక్స్‌ ఐపీవో గట్టెక్కింది!

ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌(ఐఈఎక్స్‌) పబ్లిక్‌ ఇష్యూ గట్టెక్కింది. ఈ నె 9న ప్రారంభమైన ఐఈఎక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బుధవారం(11న) ముగిసింది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 1645-1650కాగా.. తద్వారా కంపెనీ  రూ. 1,000 కోట్లను(15 కోట్ల డాలర్లు) సమీకరించింది. ఇష్యూలో భాగంగా 20 శాతం వాటాకు సమానమైన 52.75 లక్షల షేర్లను విక్రయానికి ఉంచగా.. 1.14 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. వెరసి ఇష్యూ రెండు రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది.
యాంకర్‌ నిధులు..
కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 300 కోట్లను సమీకరించింది. 23 సంస్థలకు షేరుకి రూ. 1650 ధరలో 7.89 లక్షల షేర్లను విక్రయించింది.  
విద్యుత్‌ కొనుగోలుకి వీలు..
దేశీయంగా విద్యుత్‌ కొనుగోలు, అమ్మకానికి వీలుకల్పిస్తూ ఏర్పాటైన తొలి ఎక్స్ఛేంజీగా ఐఈఎక్స్‌ ఇప్పటికే సుప్రసిద్ధమైంది. ఎలక్ట్రిసిటీ ఫిజికల్‌ డెలివరీ కోసం ట్రేడింగ్‌కు వీలు కల్పించడంతోపాటు పునరుత్పాదక ఇంధన సర్టిఫికెట్లనూ అందిస్తుంది. పవర్‌ ట్రేడింగ్‌లో  ప్రైస్‌ డిస్కవరీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లకు వీలు కల్పిస్తోంది. పవర్‌ ట్రేడింగ్‌లో దాదాపు 99 శాతం మార్కెట్‌ వాటాను ఆక్రమిస్తోంది.
ఇతర వివరాలివీ..
దేశీయంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 4 శాతం వరకూ ఎక్స్ఛేంజీల ద్వారా ట్రేడవుతుంటుంది. ఐఈఎక్స్‌ ఆదాయం గత ఐదేళ్లలో దాదాపు 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తూ వచ్చింది. నికర లాభం సైతం ఇదే స్థాయిలో పురోగతి సాధిస్తూ వచ్చింది. అయితే మార్జిన్లు 76.3 శాతం నుంచి 74.4 శాతానికి స్వల్పంగా క్షీణించాయి. మార్చితో ముగిసిన గతేడాది(2016-17)లో రూ. 38 ఈపీఎస్‌ సాధించింది. రూ. 500 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది.



Most Popular