మాట్రిమోనీ.కామ్‌ ఐపీవో నేడు‌!

మాట్రిమోనీ.కామ్‌ ఐపీవో నేడు‌!

ఆన్‌లైన్‌ ద్వారా పెళ్లి సంబంధాలను కుదిర్చే మాట్రిమోనీ.కామ్‌ పబ్లిక్‌ ఇష్యూ సోమవారం(11న) ప్రారంభంకానుంది. ఈ నెల 13న(బుధవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 983-985గా కంపెనీ నిర్ణయించింది. తద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఆఫర్లో భాగంగా రూ. 5 ముఖ విలువగల 37.67 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు రూ. 130 కోట్ల విలువ చేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇప్పటికే షేరుకి రూ. 985 ధరలో హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, బేరింగ్‌ పీఈ ఇండియా తదితర యాంకర్‌ ఇన్వెస్టర్లకు దాదాపు 23 లక్షల షేర్లను విక్రయించింది. తద్వారా రూ. 226 కోట్లు సమీకరించింది.
రిటైలర్లకు డిస్కౌంట్‌
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా అర్హతగల కంపెనీ ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 98 డిస్కౌంట్‌ను మాట్రిమోనీ ఆఫర్‌ చేస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అంతకుమించి షేర్లు కొనుగోలు చేయాలంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ప్రకటనలు, బిజినెస్‌ ప్రమోషన్‌, చెన్నైలో కార్యాలయం ఏర్పాటు తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.
కంపెనీ వివరాలివీ
2001లో ఏర్పాటైన కంపెనీ భారత్‌ మాట్రిమోనీ ద్వారా ఇంటర్నెట్‌, మొబైల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఆధారంగా పెళ్లి సంబంధాలు తదితర సర్వీసులను అందిస్తోంది. దేశీయంగా ఆన్‌లైన్‌ ద్వారా పెళ్లి సంబంధాలు కుదిర్చే తొలి కంపెనీగా మాట్రిమోనీ.కామ్‌ సుప్రసిద్ధమైంది. 30 లక్షల మందికిపైగా యాక్టివ్‌ ప్రొఫైల్స్‌ను కలిగి ఉంది. కస్టమర్లు స్వయంగా రిజిస్టర్‌ చేసుకునేందుకు వీలుగా 140 రిటైల్‌ సెంటర్లను సైతం ఏర్పాటు చేసింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2016-17)లో రూ. 293 కోట్ల ఆదాయం, దాదాపు రూ. 44 కోట్ల నికర లాభం ఆర్జించింది.



Most Popular