ఒక్క రోజే రూ. 1000 పెరిగిన బంగారం!

ఒక్క రోజే రూ. 1000 పెరిగిన బంగారం!

విదేశీ మార్కెట్లో బంగారం ధరలు ఊపందుకోవడంతో శుక్రవారం దేశీయంగానూ మెరిశాయి. స్పాట్‌ మార్కెట్లో 99.9 స్వచ్చతగల 10 గ్రాముల పసిడి ఒక్కరోజులోనే రూ. 990 జంప్‌చేసింది. రూ. 31,350ను తాకింది. ఇది 10 నెలల గరిష్టంకాగా.. వెండి సైతం కేజీ రూ. 100 పెరిగి రూ. 42,000కు చేరింది. అయితే ఫ్యూచర్స్‌ మార్కెట్‌ అయిన ఎంసీఎక్స్‌లో గురువారమే ధరలు హైజంప్‌చేయగా.. ట్రేడర్లు లాభాల స్వీకరణకు ఉపక్రమించడంతో శుక్రవారం కొంత వెనకడగు వేశాయి. 10 గ్రాముల బంగారం అక్టోబర్‌ డెలివరీ నామమాత్రంగా రూ. 14 తగ్గి రూ. 30,2682 వద్ద ముగిసింది. వెండి కేజీ డిసెంబర్‌ డెలివరీ సైతం రూ. 47 క్షీణించి రూ. 41,570 వద్ద స్థిరపడింది. 
ఏం జరిగిందంటే..?
తాజాగా అమెరికాను ఇర్మా తుఫాన్‌ భయపెడుతుండటం, ఉత్తర కొరియా హైడ్రోజన్‌ బాంబును పరీక్షించడం, హార్వీ తుఫాన్‌ ప్రభావంతో 2015 సెప్టెంబర్‌ తరువాత అమెరికాలో 62,000 మందికి ఉపాధి నష్టం జరిగిన వార్తలు ఒక్కసారిగా బంగారానికి గిరాకీని అమాంతం పెంచేశాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి కొనుగోలుకి ఇన్వెస్టర్లు, కేంద్ర బ్యాంకులు క్యూకట్టాయి. ఫలితంగా శుక్రవారం న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.3 శాతం బలపడి 1,353 డాలర్లను తాకింది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ఇంతక్రితం 2016 సెప్టెంబర్‌ 6న మాత్రమే పసిడి ధరలు ఈ స్థాయికి చేరాయి. ఇక వెండికి కూడా గిరాకీ పెరగడంతో ఔన్స్ 0.2 శాతం పుంజుకుని 18.13 డాలర్లకు చేరింది. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపునకు తగిన పరిస్థితులు నెలకొనకపోవడం, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సైతం యథాతథ పాలసీనే ప్రకటించడం వంటి అంశాల నేపథ్యంలో డాలరు బలహీనపడింది. ఇది పరోక్షంగా పసిడికి డిమాండ్‌ను పెంచినట్లు విశ్లేషకులు తెలియజేశారు.



Most Popular